సౌతాఫ్రికాతో టెస్టులకు జట్టును ప్రకటించిన నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)ని మరోసారి పక్కనపెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఈ బెంగాల్ బౌలర్‌కు మొండిచేయి చూపుతున్నారని అభిమానులు విమర్శిస్తున్నారు.
కావాలనే షమీని పక్కనపెడుతున్నారు
ఈ నేపథ్యంలో షమీ చిన్ననాటి కోచ్ మొహమ్మద్ బద్రుద్దీన్ (Mohammed Badruddin) ఘాటుగా స్పందించాడు. కారణం లేకుండానే షమీని జట్టుకు దూరం చేస్తున్నారని మండిపడ్డాడు. ఈ మేరకు ఇండియా టుడేతో మాట్లాడుతూ... ‘‘ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. వాళ్లు కావాలనే షమీని పక్కనపెడుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.
ఇంతకంటే వాళ్లకు వేరే కారణం ఏమీ లేదు. అతడు ఫిట్‌గా లేడని అంటారా?... ఓ ఆటగాడు టెస్టు మ్యాచ్‌లు ఆడుతూ.. రెండు మ్యాచ్‌లలో కలిపి 15 వికెట్లు పడగొట్టినా అతడు ఫిట్‌గా లేడంటే మనం ఏం చేయగలం?
వాళ్లు ముందే డిసైడ్ అవుతారు
సెలక్టర్లు ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తున్నారు. తాము అలా చేయడం లేదంటే.. షమీని తప్పించడానికి గల కారణం ఏమిటో వాళ్లే స్వయంగా చెప్పాలి. సౌతాఫ్రికాతో సిరీస్‌కు షమీని ఎంపిక చేస్తారని భావించాను.

స్వదేశంలో టెస్టుల్లో ఇద్దరు ఫాస్ట్‌బౌలర్లనే ఆడిస్తారు. కాబట్టి షమీకి ఈసారి అవకాశం ఇస్తారని అనుకున్నా. బుమ్రా వర్క్‌లోడ్‌ను తగ్గించే క్రమంలో షమీని పిలుస్తారని ఎదురుచూశా. అయినా.. ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేయాలనే ఉద్దేశం సెలక్టర్లకు లేదు.
వాళ్లు ముందుగానే.. తమకు ఏ ఆటగాళ్లు కావాలో ఎంచుకుంటారు. ఆ తర్వాత తామేదో పారదర్శకంగా జట్టును ఎంపిక చేసినట్లు మాట్లాడతారు. టెస్టు జట్టు ఎంపికకు రంజీ ట్రోఫీ ప్రదర్శనల కంటే ప్రామాణికం ఏమి ఉంటుంది?
టీ20 ప్రదర్శన ఆధారంగా టెస్టు జట్టును ఎంపిక చేస్తామనడం సరికాదు. రంజీల్లో బాగా ఆడుతున్న వారినే టెస్టుల్లోకి తీసుకోండి. ఏదేమైనా ఇక్కడ ముందుగానే తమకు ఇష్టమైన ఆటగాళ్లను ఎంచుకుంటారు.
సాకులు చెబుతారు
అదే జాబితాకు కట్టుబడి ఉంటారు. ఆ తర్వాత.. ‘అతడు ఫిట్‌గా లేడు.. అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ కావాలి’ అంటూ తప్పించిన ఆటగాళ్ల గురించి సాకులు చెబుతారు’’ అంటూ బద్రుద్దీన్ టీమిండియా సెలక్టర్లపై సంచలన ఆరోపణలు చేశాడు.
ఏదో ఒకరోజు సెలక్ట్ చేయక తప్పదు
అదే విధంగా.. షమీది కష్టపడే తత్వమన్న బద్రుద్దీన్.. ఆట ద్వారానే అతడు అందరికీ సమాధానం చెబుతాడని పేర్కొన్నాడు. వంద శాతం ఫిట్‌గా ఉన్న షమీ.. త్వరలోనే టీమిండియాలోకి వస్తాడనే నమ్మకం తనకు ఉందని.. షమీతో తాను ఇదే మాట చెప్పానని తెలిపాడు.
అద్భుతంగా ఆడే ఆటగాడిని సెలక్టర్లు ఏదో ఒకరోజు జట్టుకు ఎంపిక చేయక తప్పదని పేర్కొన్నాడు. వరల్డ్‌కప్, చాంపియన్స్ ట్రోఫీలో జట్టు కోసం శ్రమించిన ఆటగాడిని పక్కనపెట్టడం ఎంతమాత్రం సరికాదని బద్రుద్దీన్ పునరుద్ఘాటించాడు.
చదవండి: అతడి కెరీర్ ముగించేశారు కదా!: అగార్కర్‌పై విమర్శల వర్షం
సౌతాఫ్రికాతో టెస్టులకు టీమిండియా ప్రకటన


