టీమిండియా తరఫున టెస్టుల్లో పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్న వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammad Shami) ఆశలపై సెలక్టర్లు నీళ్లు పోశారు. దేశీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నా అతడిపై శీతకన్నేశారు. సౌతాఫ్రికాతో టెస్టుల (IND vs SA Tests)కు ఎంపిక చేసిన జట్టులో షమీకి సెలక్టర్లు చోటివ్వలేదు.
ఫలితంగా టీమిండియా యాజమాన్యంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar), హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కావాలనే షమీ కెరీర్‌ను ప్రశ్నార్థకం చేశారంటూ అతడి అభిమానులు మండిపడుతున్నారు. కాగా రెండేళ్ల క్రితం షమీ చివరగా టీమిండియా తరఫున టెస్టులు ఆడాడు.
ఆ తర్వాత చీలమండ గాయంతో చాన్నాళ్లు జట్టుకు దూరమైన షమీ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వన్డే టోర్నీలో భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ.. ఇంగ్లండ్‌తో టెస్టులు, ఆస్ట్రేలియాతో వన్డేలకు ఈ రైటార్మ్ పేసర్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.
అప్‌డేట్ లేదని..
ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీ ఫిట్‌నెస్ గురించి తమకు అప్‌డేట్ లేదని.. అందుకే పక్కనపెట్టామని చెప్పాడు. అయితే, అగార్కర్ వ్యాఖ్యలకు షమీ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. రంజీలు ఆడేందుకు ఫిట్‌గా ఉన్న తాను.. వన్డేలు కూడా ఆడలేనా? అని ప్రశ్నించాడు.

ఆటతోనే సమాధానం
ఈ క్రమంలో అగార్కర్ బదులిస్తూ.. షమీ ఫిట్‌గా లేనందు వల్లే తాము అతడిని ఇంగ్లండ్ పర్యటన, ఆసీస్ టూర్‌కు ఎంపిక చేయలేదని మరోసారి పునరుద్ఘాటించాడు. ఈ నేపథ్యంలో రంజీ సీజన్‌లో బెంగాల్ తరఫున చివరగా గుజరాత్‌తో మ్యాచ్ ఆడిన షమీ.. ఆటతోనే అగార్కర్‌కు సమాధానమిచ్చాడు.
గుజరాత్‌తో మ్యాచ్‌లో మొత్తంగా ఎనిమిది వికెట్ల (3/44, 5/38)తో చెలరేగి.. సెలక్టర్లకు సవాల్ విసిరాడు. బెంగాల్ విజయంలో కీలక పాత్ర పోషించి సత్తా చాటాడు. ఈ క్రమంలో మీడియా షమీని పలకరించగా.. తాను ఇప్పుడు ఏం మాట్లాడినా.. అందుకు అపార్థాలు తీస్తారని పేర్కొన్నాడు.
సీన్ రివర్స్
ఈ నేపథ్యంలో టీమిండియా కొత్త సెలక్టర్ ఆర్పీ సింగ్ సూచన మేర, అతడి నుంచి అందిన హామీ మేరకే షమీ ఇలా మాట మార్చాడని నెటిజన్లు చర్చించుకున్నారు. అగార్కర్- షమీ మాటల యుద్ధానికి తెరపడినట్లేనని.. సౌతాఫ్రికాతో టెస్టులకు అతడిని ఎంపిక చేస్తారని అభిప్రాయపడ్డారు. కానీ సీన్ రివర్స్ అయింది.
బెంగాల్ జట్టుకే ప్రాతినిథ్యం వహిస్తున్న మరో పేసర్ ఆకాశ్ దీప్‌ను ఎంపిక చేసిన సెలక్టర్లు.. షమీకి మాత్రం మరోసారి మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో 35 ఏళ్ల షమీ టెస్టు రీఎంట్రీ కల ముగిసినట్లేనని.. ఇకపై షమీని టీమిండియా టెస్టు జెర్సీలో చూడలేమంటూ అభిమానులు ఉసూరుమంటున్నారు.
మీకు ఎందుకింత పగ
‘ఇగో’ కారణంగానే అతడి కెరీర్‌ను నాశనం చేస్తున్నారంటూ.. మీకు ఎందుకింత పగ? అంటూ అగార్కర్‌పై మండిపడుతున్నారు. కాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టీమిండియా రెండు టెస్టులు ఆడనుంది. ఇందుకోసం శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బుధవారం ప్రకటించింది.
చదవండి: IND vs SA Tests: సౌతాఫ్రికాతో టెస్టులకు టీమిండియా ప్రకటన


