సౌతాఫ్రికాతో టెస్టులకు టీమిండియా ప్రకటన.. షమీకి స్థానం ఉందా? | BCCI Announces India Test Squad for South Africa Series | Rishabh Pant Makes Comeback | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికాతో టెస్టులకు టీమిండియా ప్రకటన.. షమీకి స్థానం ఉందా?

Nov 5 2025 6:53 PM | Updated on Nov 5 2025 9:02 PM

BCCI Announces Indian Squad For South Africa Test Series Pant Returns

సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) తమ జట్టును ప్రకటించింది. శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) సారథ్యంలోని ఈ టీమ్‌కు పదిహేను మంది సభ్యులను సెలక్టర్లు ఎంపిక చేశారు.

ఇక ఇంగ్లండ్‌ పర్యటనలో గాయపడిన వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant).. ప్రొటిస్‌ జట్టుతో సిరీస్‌ ద్వారా టీమిండియా తరఫున పునరాగమనం చేయనున్నాడు. ఇప్పటికే పంత్‌.. సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్‌- ‘ఎ’ (IND A vs SA) కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

పడిక్కల్‌పై సెలక్టర్ల నమ్మకం
బెంగళూరు వేదికగా జరిగిన తొలి అనధికారిక టెస్టులో పంత్‌ 90 పరుగులతో రాణించి.. భారత్‌ను గెలిపించాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ తమ స్థానాలు నిలబెట్టుకోగా.. సాయి సుదర్శన్‌తో పాటు దేవదత్‌ పడిక్కల్‌కు సెలక్టర్లు చోటు ఇచ్చారు.

ఆస్ట్రేలియా పర్యటనతో పాటు.. ఇటీవల సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో తొలి టెస్టులో విఫలమైనా పడిక్కల్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచడం విశేషం. మరోవైపు.. పంత్‌ వికెట్‌ కీపర్‌గా రీఎంట్రీ ఇవ్వగా.. ధ్రువ్‌ జురెల్‌ స్పెషలిస్టు బ్యాటర్‌గా తుదిజట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

షమీకి మరోసారి మొండిచేయి
ఇక స్పిన్నర్ల కోటాలో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌తో పాటు.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ స్థానం సంపాదించగా.. పేసర్ల కోటాలో జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు మొహమ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌, ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డిని సెలక్టర్లు ఎంపిక చేశారు.

ఈ క్రమంలో వెటరన్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీకి మరోసారి మొండిచేయే ఎదురైంది. రంజీ ట్రోఫీ తాజా సీజన్‌లో ఇటీవల బెంగాల్‌ తరఫున షమీ సత్తా చాటినా సెలక్టర్లు అతడిని కనికరించలేదు. మరో బెంగాల్‌ పేసర్‌ ఆకాశ్‌కు చోటిచ్చి షమీని మాత్రం పక్కనపెట్టారు.  

కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సీజన్‌లో భాగంగా టీమిండియా.. సౌతాఫ్రికాతో సొంతగడ్డపై రెండు టెస్టులు ఆడనుంది. నవంబరు 14- నవంబరు 26 వరకు ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి టెస్టుకు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదిక కాగా.. రెండో టెస్టుకు  గువాహటిలోని బర్సపరా క్రికెట్‌ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది.

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టు
శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌/వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, ధ్రువ్‌ జురెల్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, మొహమ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ఆకాశ్‌ దీప్‌.

చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా డీకే.. పన్నెండు జట్ల వివరాలు ఇవే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement