వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల నిర్వహణ హక్కులను కోల్పోయిన ఆర్సీబీ హోం గ్రౌండ్‌ | Women's World Cup 2025: Bengaluru Games shifted, Trivandrum Likely To Host | Sakshi
Sakshi News home page

వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల నిర్వహణ హక్కులను కోల్పోయిన ఆర్సీబీ హోం గ్రౌండ్‌

Aug 13 2025 1:41 PM | Updated on Aug 13 2025 3:27 PM

Women's World Cup 2025: Bengaluru Games shifted, Trivandrum Likely To Host

ఆర్సీబీ ఐపీఎల్‌ 2025 విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాట బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు మాయని మచ్చగా మిగిలిపోనుంది. ఈ స్డేడియం తాజాగా మహిళల వన్డే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల నిర్వహణ హక్కులను కోల్పోయింది. షెడ్యూల్‌ ప్రకారం మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో ఐదు మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉండింది.

అయితే ఈ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోలేదని తెలుస్తుంది. ఆర్సీబీ విజయోత్సవ తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన జస్టిస్‌ కున్హా కమిటీ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు ససేమిరా అన్నట్లు సమాచారం. స్టేడియం డిజైన్‌, స్ట్రక్చర్‌ భారీ సమూహాలు గుమి కూడేందుకు సేఫ్‌ కాదని కున్హా కమిటీ తేల్చినట్లు తెలుస్తుంది.

దీంతో చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌లను వేరే వేదికకు తరలించేందుకు బీసీసీఐ సిద్దమైంది. మ్యాచ్‌ల నిర్వహణ రేసులో తిరువనంతపురం ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తుంది.

షెడ్యూల్‌ ప్రకారం భారత్‌-శ్రీలంక మధ్య ఇనాగురల్‌ మ్యాచ్‌ సహా మరో నాలుగు మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉండింది. ఇందులో ఓ సెమీస్‌ సహా భారత్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌, ఇంగ్లండ్‌-సౌతాఫ్రికా మ్యాచ్‌లు ఉన్నాయి.

మహిళల వన్డే వరల్డ్‌కప్‌ సెప్టెంబర్‌ 30-నవంబర్‌ 2 మధ్యలో భారత్‌, శ్రీలంక దేశాల్లో పలు వేదికల్లో జరుగనుంది. కున్హా కమిటీ నివేదిక ప్రకారం.. చిన్నస్వామి స్టేడియం డిజైన్‌ను పూర్తిగా మార్చే వరకు ఈ వేదకపై ఎలాంటి క్రికెట్‌ మ్యాచ్‌లు జరగవు. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీకి హోం గ్రౌండ్‌గా చిన్నస్వామి స్టేడియం ఉండే అవకాశం లేనట్లే.

కున్హా కమిటీ నివేదిక ఆధారంగా కొద్ది రోజుల కిందట కేఎస్‌సీఏ ఆథ్వర్యంలో జరిగే మహారాజా టీ20 టోర్నీని కూడా మైసూరుకు తరలించారు. మహిళల వన్డే వరల్డ్‌కప్‌కు ముందు జరగాల్సిన పలు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లను కూడా చిన్నస్వామి స్టేడియం నుంచి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement