వైభవ్‌ గురించి ఆమెను ఎందుకు అడిగారు? | Know Reason Behind Why Vaibhav Sooryavanshi Question To Olympian Manu Bhaker Created Social Media Storm, Video Went Viral | Sakshi
Sakshi News home page

మీకసలు బుద్ధుందా?.. వైభవ్‌ గురించి ఆమెను ఎందుకు అడిగారు?

Apr 28 2026 9:49 AM | Updated on Apr 28 2026 10:14 AM

Why Vaibhav Sooryavanshi Question To Manu Bhaker Created Social Media Storm

క్రికెట్‌ వర్గాల్లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉన్న పేరు వైభవ్‌ సూర్యవంశీ. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా పరుగుల వరద పారిస్తున్న ఈ పదిహేనేళ్ల పిల్లాడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఐపీఎల్‌-2026లోనూ రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ జోరు కొనసాగుతోంది.

36 బంతుల్లోనే శతక్కొట్టి.. 
ఇటీవల సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో మ్యాచ్‌లో వైభవ్‌ 36 బంతుల్లోనే శతక్కొట్టి.. విధ్వంసకర బ్యాటింగ్‌కు తాను పెట్టింది పేరని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్లు సైతం అతడి ప్రతిభను కొనియాడుతూ కాబోయే సూపర్‌ స్టార్‌ అంటూ కితాబులిస్తున్నారు.

వయసు అసలు లెక్కలోకే రాదు
ఈ నేపథ్యంలో ఒలింపిక్‌ పతకాల విజేత, భారత షూటర్‌ మనూ భాకర్‌కు ఓ కార్యక్రమం సందర్భంగా వైభవ్‌ సూర్యవంశీ గురించి ప్రశ్న ఎదురైంది. ఢిల్లీలో జరిగిన జాతీయ రైఫిల్‌ సమాఖ్య 75వ వార్షికోత్సవానికి హాజరైన ఆమె ఇందుకు బదులిస్తూ.. ‘‘అతడి చుట్టూ ఉన్న వాళ్లు.. మార్గదర్శనం చేసే వాళ్లు గొప్పగా ఉంటే.. వయసు అసలు లెక్కలోకే రాదు.

అయినా ప్రతిభకు వయసుతో పనిలేదు. కొంతమంది అరవై ఏళ్లలో అద్భుతాలు చేస్తే.. మరికొందరికి ఆరేళ్లకే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్లు సరైన దారిలో నడిపిస్తే అనుకున్న లక్ష్యాలు చేరుకోవడం కాస్త సులువు అవుతుంది. టీమిండియా తదుపరి బిగ్‌ స్టార్‌ అతడే’’ అని పేర్కొంది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. మనూ భాకర్‌ను ప్రశ్న అడిగిన విలేకరుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్‌ జట్టు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మాజీ టీమ్‌ డైరెక్టర్‌ జాయ్‌ భట్టాచార్య ఈ విషయంపై ఘాటుగా స్పందించాడు.

ఆమె ఒలింపిక్‌ పతకాల విజేత
‘‘ఆమె ఒలింపిక్‌ పతకాల విజేత. ఆమె క్రీడ, విజయాల గురించి కాకుండా వైభవ్‌ సూర్యవంశీ గురించి అడగడం ఎందుకు? మన దేశంలో క్రికెట్‌నే సర్వస్వంగా భావించేవాళ్లు ఉన్నారని తెలుసు. కానీ ఎక్కడ ఏ ప్రశ్న అడగాలో స్పోర్ట్స్‌ ఎడిటర్లకు తెలియదా?

సూర్యవంశీ గురించి ఆమెను అడగాల్సిన అవసరం ఏముంది?.. హెడ్‌లైన్‌ కోసమే కదా ఇదంతా!.. ఒకవేళ మీరు వైభవ్‌ సూర్యవంశీని కలిస్తే అప్పుడు మనూ భాకర్‌ గురించి అడగండి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి’’ అని భట్టాచార్య ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సిగ్గుపడండి
మరికొందరు నెటిజన్లు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘యువ షూటర్ల గురించి దిగ్గజ క్రికెటర్లు ఎప్పుడైనా మాట్లాడారా? మరి మనూ భాకర్‌ వైభవ్‌ గురించి ఎందుకు మాట్లాడాలి? మీ ద్వంద్వ ప్రమాణాలకు సిగ్గుపడండి’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. 

కాగా పారిస్‌ ఒలింపిక్స్‌లో మనూ భాకర్‌ రెండు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. స్వతంత్ర భారత్‌లో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి ప్లేయర్‌గా ఆమె రికార్డు నెలకొల్పింది.

చదవండి: సింధు కణతపై ‘టెంపుల్‌’.. స్పందించిన భర్త

Advertisement
 
Advertisement
Advertisement