
భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య వైరం మరింత ముదురుతోంది. మొన్న ఆసియాకప్‌లో ఇరు జట్ల మధ్య చోటు చేసుకున్న సంఘటనలు మరవకముందే.. మహిళల వన్డే ప్రపంచకప్-2025లో చిరకాల ప్రత్యర్ధుల మధ్య మరో వివాదం చోటు చేసుకుంది.
ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్-పాక్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ మునీబా అలీ రనౌట్ వివాదస్పదమైంది. పాక్ అభిమానులు మునీబాది నాటౌట్ అంటుంటే ఇండియన్ ఫ్యాన్స్ క్లియర్ ఔట్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

అసలేమి జరిగిదంటే?
పాకిస్తాన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన క్రాంతి గౌడ్ ఆఖరి బంతిని మునీబాకు మిడిల్ అండ్ లెగ్ స్టంప్ దిశగా సంధించింది. ఆ బంతిని మునీబా లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించింది. కానీ బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి మునీబా అలీ ఫ్రంట్ ప్యాడ్ తాకుతూ వికెట్ కీపర్ వైపు వెళ్లింది.
దీంతో భారత ప్లేయర్లు ఎల్‌బీడబ్ల్యూకి అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ అంటూ తల ఊపారు. ఇంతలోనే మునీబా క్రీజు బయటకు ఒక్క అడుగు ముందుకు వేసి తిరిగి రావడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో దీప్తి శర్మ వికెట్ కీపర్ వెనక నుంచి డైరక్ట్ త్రోతో స్టంప్స్‌ను గిరాటేసింది.
దీంతో ఫీల్డ్ అంపైర్‌లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. తొలుత థర్డ్ అంపైర్ నాటౌట్‌గా సూచించినప్పటికి.. అంపైర్ కెరిన్ క్లాస్ట్ ఆ తర్వాత పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించి తన నిర్ణయాన్ని మార్చి ఔట్‌గా ప్రకటించింది. బంతి స్టంప్స్‌కు తాకే సమయంలో మనీబా బ్యాట్ గాల్లో ఉందని అంపైర్ చెప్పుకొచ్చారు.
థర్డ్ అంపైర్ నిర్ణయంతో పాక్ శిబిరం మొత్తం షాక్‌కు గురయ్యారు. అయితే బంతి స్టంప్స్‌కు తాకక ముందు మునీబా బ్యాట్ పాపింగ్ క్రీజులో ఉంచింది. కాబట్టి నాటౌట్ అంటూ పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగింది. ఫోర్త్ అంపైర్ రూల్స్‌ను వివరించడంతో ఆమె వెనక్కి తగ్గింది. ఏదేమైనప్పటికి మైదానంలో కాసేపు గందరగోళం నెలకొంది.
రూల్స్ ఏమి చెబుతున్నాయి?
ఎంసీసీ కొత్త రూల్స్ ప్రకారం.. ఒక బ్యాటర్ బంతి స్టంప్స్‌కు తాకక ముందు తన బ్యాట్‌ను పాపింగ్ క్రీజ్ వెనుక ఒక్కసారి ఉంచితే చాలు. ఆ తర్వాత బంతి స్టంప్స్‌కు తాకే సమయంలో బ్యాట్ గాల్లో ఉన్న కూడా నాటౌట్‌గా పరిగిణిస్తారు. అయితే ఈ రూల్ కేవలం రన్‌కు ప్రయత్నించేటప్పుడు మాత్రమే వర్తిస్తుంది. కానీ మునీబా రన్ కోసం పరిగెత్తలేదు.
క్రీజులో నిలబడి బయటకు వెళ్లి వచ్చింది. కాబట్టి ఆమె అవుట్ వికెట్ కీపర్ బ్యాటర్ స్టంప్ చేయడంతో సమానం. బంతి బెయిల్స్ పడగొట్టిన సమయంలో ఆమె బ్యాట్ గాలిలో ఉంది. అందుకే థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. అదే ఆమె రన్‌కు ప్రయత్నించే సమయంలో ఇలా జరిగింటే నాటౌట్ ఇచ్చేవారు.
రూల్ 30.1 ప్రకారం.. మునీబాను ఔట్‌గా ప్రకటించారు. ఈ రూల్ ప్రకారం ఒక బ్యాటర్ తన బ్యాట్ లేదా పాదం లేదా శరీరంలోని ఏ భాగమైనా పాపింగ్ క్రీజ్ చివరన లేకపోతే ఔట్‌గానే పరిగణిస్తారు.
రూల్ 30.1.2 ప్రకారం.. ఒక బ్యాటర్ రన్‌కు పరిగెత్తడం లేదా డైవ్ చేసే సందర్భాల్లో బ్యాట్ ఒక్కసారి పాపింగ్ క్రీజు వెలుపుల గ్రౌండింగ్ చేస్తే చాలు. అనంతరం బెయిల్స్ పడే సమయంలో బ్యాట్ గాల్లో ఉన్నా నాటౌట్‌గానే లెక్కలోకి తీసుకుంటారు.