ఇంగ్లండ్‌దే టి20 సిరీస్‌ | West Indies lose in the second T20 match as well | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌దే టి20 సిరీస్‌

Jun 9 2025 1:53 AM | Updated on Jun 9 2025 1:53 AM

West Indies lose in the second T20 match as well

రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయిన వెస్టిండీస్‌

బ్రిస్టల్‌: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్‌ జట్టు... వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించింది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. 

జాన్సన్‌ చార్లెస్‌ (39 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్‌ షై హోప్‌ (38 బంతుల్లో 49; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), రోవ్‌మన్‌ పావెల్‌ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), జేసన్‌ హోల్డర్‌ (9 బంతుల్లో 29 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్‌ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ల్యూక్‌ వుడ్‌ 2 వికెట్లు తీయగా... బ్రైడన్‌ కార్స్, జేకబ్‌ బెథెల్, ఆదిల్‌ రషీద్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది. 

197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు 18.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి గెలిచింది. బెన్‌ డకెట్‌ (18 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్‌), జోస్‌ బట్లర్‌ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హ్యారీ బ్రూక్‌ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెథెల్‌ (10 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు), టామ్‌ బాంటన్‌ (11 బంతుల్లో 30 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించి ఇంగ్లండ్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. సిరీస్‌లోని చివరిదైన మూడో టి20 మ్యాచ్‌ మంగళవారం సౌతాంప్టన్‌లో జరుగుతుంది.   

Advertisement
 
Advertisement
Advertisement