
ICC ODI World Cup 2023: గత పదిహేనేళ్లలో టీమిండియా గెలిచిన రెండు ప్రపంచకప్ టోర్నీల్లో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పాత్ర మరువలేనిది. పొట్టి ఫార్మాట్‌లో ప్రవేశపెట్టిన తొలి వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో యువీ సభ్యుడు. 2007 నాటి ఆ ఈవెంట్లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు..
యువీ సృష్టించిన ఈ అరుదైన రికార్డు క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఇక వన్డే వరల్డ్‌కప్-2011లో యువరాజ్ సింగ్ అద్భుతమైన ఆట తీరుతో టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు.
నాడు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ
నాటి టోర్నీలో ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మొత్తంగా 362 పరుగులు సాధించడంతో పాటు.. 15 వికెట్లు పడగొట్టాడు. గేమ్ ఛేంజర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక మరోసారి భారత్ వేదికగా 50 ఓవర్ల ఫార్మాట్‌లో ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో యువరాజ్ సింగ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
గేమ్ ఛేంజర్ అతడే
ఈసారి టీమిండియా యువ సంచలనం శుబ్‌మన్ గిల్ గేమ్ ఛేంజర్ అవుతాడని అభిప్రాయపడ్డాడు. ‘‘అతడు ఇప్పటికే స్టార్ బ్యాటర్‌గా ఎదిగాడు. ఫియర్‌లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
ఈసారి తనే గేమ్ ఛేంజర్ అవుతాడని నా నమ్మకం. అన్ని అవరోధాలను తప్పక అధిగమిస్తాడు. ఎవరైతే దూకుడుగా ఆడుతూ మంచి ఫామ్‌లో ఉంటారో అలాంటి ఆటగాడు తప్పక టీమిండియాకు విజయాలు అందిస్తాడు. గిల్ నుంచి నేను ఆశిస్తున్నది ఇదే’’ అని టైమ్స్ నౌతో యువీ వ్యాఖ్యానించాడు.
చదవండి: సచిన్, కోహ్లి కాదు! అతడికి బౌలింగ్ చేయడం చాలా కష్టం: డేల్ స్టెయిన్