భారత్ గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ గెలిచి కొత్త ఏడాదిలో శుభారంభం అందుకుంది న్యూజిలాండ్. టీ20 సిరీస్‌లోనూ ఇదే ఫలితం పునరావృతం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు పటిష్ట, నంబర్ వన్ జట్టును ఓడించి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని భావిస్తోంది.
ఇదేమీ అంత కష్టం కాదంటున్నాడు కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner), డారిల్ మిచెల్ జోరు కొనసాగిస్తే తాము సులువుగానే టీ20 సిరీస్‌నూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు వచ్చింది న్యూజిలాండ్.
డారిల్‌దే కీలక పాత్ర
ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగగా.. కివీస్ భారత్‌ను 2-1తో ఓడించి సిరీస్ గెలిచింది. ఈ గెలుపులో న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్‌ది కీలక పాత్ర. ఈ సిరీస్‌లో అతడు సాధించిన పరుగులు వరుసగా.. 84, 131 నాటౌట్, 137.
గతంలో స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు బాగా ఇబ్బంది పడ్డ డారిల్ మిచెల్ (Daryl Mitchell).. ఈసారి మాత్రం ఆ అవరోధాన్ని అధిగమించాడు. ముఖ్యంగా భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) బౌలింగ్‌లో అతడు చితక్కొట్టడం ఇందుకు నిదర్శనం. వన్డే ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని.. టీ20 సిరీస్‌లోనూ మిచెల్ అద్భుతాలు చేస్తాడని కివీస్ గట్టిగా నమ్ముతోంది.
ఆరంభంలో ఇబ్బంది పడ్డాడు
ఈ నేపథ్యంలో నాగ్‌పూర్‌లో బుధవారం నాటి తొలి టీ20కి ముందు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. ‘‘కెరీర్ ఆరంభంలో డారిల్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక చాలా ఇబ్బందిపడ్డాడు. అయితే, ఆ లోపాన్ని సరిచేసుకునేందుకు అతడు కఠినంగా శ్రమించాడు.
అందుకు తగ్గ ఫలితాలు, ఫలాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రస్తుతం అతడు స్పిన్‌ను సమర్థవంతంగా ఆడుతున్నాడు. ముఖ్యంగా వన్డేల్లో మధ్య ఓవర్లలో మ్యాచ్‌ను తన నియంత్రణలోకి తెచ్చుకున్న తీరు అద్భుతం. టీ20 సిరీస్‌లోనూ అదే స్థాయి ప్రదర్శన కనబరుస్తాడని ఆశిస్తున్నాం’’ అని సాంట్నర్ పేర్కొన్నాడు.
ఇక్కడా గెలుస్తాం
ఇక ఇటీవలి కాలంలో సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియాను వైట్‌వాష్ చేసిన న్యూజిలాండ్.. తాజాగా వన్డే సిరీస్‌లో తొలిసారి గెలుపు రుచిచూసింది. ఈ నేపథ్యంలో సాంట్నర్ మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో ఆడటం మాకెంతో ఇష్టం. అలాంటిది ఇక్కడ చారిత్రాత్మక విజయాలతో ముందుకు సాగడం మరింత సంతోషం.
ఇప్పటికే రెండు ఫార్మాట్లలో అనుకున్న ఫలితం రాబట్టాము. ఇప్పుడు కూడా అదే పునరావృతం చేయాలని పట్టుదలగా ఉన్నాము. టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇదొక మంచి సన్నాహకంగా ఉంటుంది’’ అని సాంట్నర్ తెలిపాడు.
చదవండి: భారత్‌లో మ్యాచ్‌లు.. బంగ్లాదేశ్ కెప్టెన్ స్పందన వైరల్


