
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలు ఇద్దరూ ఇద్దరే. వీరిద్దరిలో ఎవరు గొప్ప క్రికెటర్ అంటే సమాధానం చెప్పేందుకు కచ్చితంగా ఆలోచించాల్సిందే. ఒకరేమో 24 ఏళ్ల పాటు తన జీవితాన్ని భారత క్రికెట్‌కు అంకితం చేస్తే.. మరొకరేమో గత 17 ఏళ్ల నుంచి తన సేవలను అందిస్తున్నారు.
ఒకరు క్రికెట్‌కు గాడ్ అయితే.. మరొకరు ఆ దేవుడు రికార్డులను కొల్లగొడుతున్న రన్ మిషన్. కాబట్టి సచిన్, కోహ్లిలలో ఎవరు గ్రేట్ క్రికెటర్ అంటే నీళ్లు నమలాల్సిందే. తాజాగా ఇదే పరిస్థితి సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌కు ఎదురైంది.
ఏబీ డివిలియర్స్ ఇటీవల శుభంకర్ మిశ్రా యూట్యూబ్ ఛానెల్ పాడ్ కాస్ట్‌లో పాల్గోన్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలో గొప్ప క్రికెటరో ఎవరో ఎంచుకోవాలని ఏబీడీని హోస్ట్ అడిగాడు. అందుకు కాసేపు ఆలోచించి డివిలియర్స్ తెలివగా సమాధనమిచ్చాడు.
"ఇద్దరిని ఒకరితో ఒకరని పోల్చలేము. ఎందుకంటే ఆ తరంలో సచిన్ టెండూల్కర్ గొప్ప క్రికెటర్. ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లి గ్రేట్. ఎవరి తరంలో వారు గొప్ప క్రికెటర్లు. కాబట్టి పోల్చడం అసాధ్యం. నాక్ సచిన్ అంటే చాలా గౌరవం. అతను అతిసాధారణ స్థాయి నుంచి ఒక లెజెండ్‌గా ఎదిగాడు.
ఇక విరాట్ నా స్నేహితుడు. కాబట్టి ఇద్దరిలో ఎవరూ గొప్ప అని నేను చెప్పలేను. అయితే విరాట్ ఆల్ ఫార్మాట్లలో గ్రేట్ నేను భావిస్తున్నాను. వన్డే, టెస్టు ఫార్మాట్లలో సచిన్‌ను మించిన వారు లేరు అనుకుంటున్నా" అని డివిలియర్స్ పేర్కొన్నాడు.
టాప్ రన్ స్కోరర్‌గా..
సచిన్ టెండూల్కర్ టీమిండియా తరఫున 200 టెస్టు మ్యాచ్‌లు ఆడి 15,921 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి టెస్టు కెరీర్‌లో 51 సెంచరీలు, ఆరు డబుల్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా వన్డేల్లో కూడా మాస్టర్ బ్లాస్టర్ టాప్‌లో ఉన్నాడు. 452 ఇన్నింగ్స్‌లలో 49 సెంచరీలు, ఓ డబుల్ సెంచరీతో 18426 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా సచిన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 34,357 పరుగులు చేశాడు.
సెంచరీల రికార్డు బ్రేక్..
ఇక టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. కోహ్లి తన టెస్టు కెరీర్‌లో 123 మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు చేశాడు. అయితే వన్డేల్లో మాత్రం అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. సచిన్ వన్డేల్లో 49 శతకాలు చేస్తే.. కోహ్లి ఇప్పటివరకు 51 సెంచరీలు నమోదు చేశాడు. మొత్తంగా 302 వన్డేల్లో కోహ్లి ఇప్పటివరకు 57.88 సగటుతో 14181 రన్స్ చేశాడు.
ఇక ఇది ఇలా ఉండగా.. వరల్డ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 టోర్నీ విజేతగా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ నిలిచింది. ఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్స్‌ను 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా చిత్తు చేసింది. ఈ విజయంలో డివిలియర్స్‌ది కీలక పాత్ర. 60 బంతుల్లో డివిలియర్స్ 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 120 పరుగులు చేశాడు.
చదవండి: ప్రియజిత్.. ఇంత త్వరగా వెళ్లిపోయావా? 22 ఏళ్లకే క్రికెటర్ మృతి