
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడు. ఐపీఎల్-2025 సీజన్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న కింగ్ కోహ్లి.. ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో భారత జట్టు తరపున ఆడనున్నాడు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న కోహ్లి ఆసీస్‌తో సిరీస్ కోసం తన ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాడు.
ట్రైనింగ్ సెషన్‌లో గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ నయీమ్ అమీన్‌తో కోహ్లి కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో అభిమానులు కింగ్ తిరిగొస్తున్నాడని తెగ సంబరపడుతున్నారు. కాగా టెస్టులకు,టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.
పొట్టి ప్రపంచకప్-2024 విజయం తర్వాత అంతర్జాతీయ టీ20లు వీడ్కోలు పలికిన కోహ్లి.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. కోహ్లి చివరగా భారత తరపున ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడాడు. ఈ మెగా టోర్నీ టైటిల్‌ను భారత్ సొంతం చేసుకోవడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడు. ఐదు మ్యాచ్‌లలో మొత్తంగా విరాట్ 218 పరుగులు చేశాడు.
వన్డే వరల్డ్‌కప్‌లో కోహ్లి ఆడుతుతా?
అయితే దక్షిణాఫ్రికా వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్-2027లో కోహ్లి ఆడేది అనుమానమే. అప్పటికి అతడి వయస్సు 38 ఏళ్ల దాటుతుండడంతో ఈ మెగా టోర్నీకి ఓ యువ ఆటగాడిని సిద్దం చేసే యోచనలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పర్యటన తర్వాత కోహ్లి, రోహిత్‌ల వన్డే భవిష్యత్తుపై ఓ క్లారిటి వచ్చే అవకాశముంది. ఇప్పటి నుంచి ప్రపంచకప్-2027 ముందు వరకు భారత జట్టు 27 వన్డేలు ఆడనుంది. వరల్డ్ కప్ కోసం జట్టు సెలక్షన్ రేసులో ఉండాలంటే ఈ సీనియర్ ద్వయం ఫిట్‌నెస్, ఫామ్‌ను కాపాడుకోవాలి.
అయితే దేశవాళీ టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీలో కూడా రోకో ఆడనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటన ఆక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
చదవండి: ఐపీఎల్-2025లో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే! టీమిండియా లెజెండ్‌పై వేటు?