నయా బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కుటుంబం నుంచి మరో క్రికెటర్ ఇప్పుడు వెలుగులోకి వచ్చాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కేవలం 10 ఏళ్ల వయస్సులోనే సెంచరీ బాది యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.
తనకంటే సీనియర్ బౌలర్లను సైతం విడిచిపెట్టలేదు. మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఆ చిచ్చర పిడుగు ఎవరో కాదు వైభవ్ చిన్న తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ. ఇప్పుడు అన్న బాటలోనే ఆశీర్వాద్ కూడా అడుగులు వేస్తున్నాడు.
ఆశీర్వాద్ తాజాగా బిహార్‌లోని సమస్తిపూర్‌లో జరిగిన ఒక స్థానిక ప్రాక్టీస్ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 'క్రికెట్ అకాడమీ తాజ్‌పూర్' తరపున ఆడిన జూనియర్ వైభవ్ 87 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ 118.39గా నమోదైంది.
తమ్ముడి క్లాస్ ఇన్నింగ్స్ చూసి మురిసిపోయిన వైభవ్ సూర్యవంశీ.. సోషల్ మీడియా ద్వారా ఆశీర్వాద్‌కు అభినందనలు తెలిపాడు. ఆశీర్వాద్ స్కోర్ కార్డ్‌కు సంబంధించి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అన్నకు తగ్గ తమ్ముడు అని కామెంట్లు చేస్తున్నారు.
కాగా వైభవ్ ఇప్పటికే భారత సీనియర్ జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ల కోసం అతడిని జట్టులోకి తీసుకున్నారు. తద్వారా భారత జట్టుకు సెలక్ట్ అయిన అతి పిన్న వయష్కుడిగా సచిన్ రికార్డును సూర్యవంశీ(15) బ్రేక్ చేశాడు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లోనూ వైభవ్ అసాధరణ ప్రదర్శన చేశాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి టోర్నమెంట్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: IND vs AFG: మరికొన్ని గంటల్లో మ్యాచ్.. అంతలోనే స్టార్ క్రికెటర్ తండ్రి మరణం


