ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిఫా వరల్డ్‌కప్‌లో మ్యాచ్‌లను నిర్వహించాల్సిన ఓ రిఫరీకి ఊహించని అవమానం ఎదురైంది. సోమాలియాకు చెందిన ప్రముఖ రిఫరీ ఒమర్ అబ్దుల్‌కదీర్ ఆర్టాన్‌కు అమెరికాలోకి ప్రవేశం నిరాకరించారు. అందుకు సరైన కారణాలేవీ చూపించకపోవడమూ తీవ్ర దుమారం రేపింది. దీంతో.. ఆయన ప్రపంచకప్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఈ పరిస్థితుల్లోనూ ఆయనోక బంపర్ ఆఫర్ తగిలింది..
సోమాలియా రిఫరీ ఓమర్ ఆర్టాన్‌కు అమెరికాలో ఊహించని షాక్ ఎదురైంది. మియామీ ఎయిర్‌పోర్ట్ చేరుకున్న ఆయన్ని.. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఆయన్ని ఆపేసి విచారణ పేరుతో 11 గంటలపాటు ప్రశ్నించారు. ఈ విచారణలో ఆయన ప్రయాణ ఉద్దేశ్యం, ప్రపంచకప్‌లో తన అధికారిక బాధ్యతలు, అలాగే సోమాలియాలోని రాజకీయ పరిస్థితులు, భద్రతా నేపథ్యం వంటి అంశాలపై అధికారులు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. అంతేకాకుండా సోమాలియాలో క్రియాశీలంగా ఉన్న అల్-షబాబ్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది.
విచారణ అనంతరం అధికారులు ఆయనను ‘అమెరికాలో ప్రవేశానికి అనర్హుడు’ (inadmissible)గా ప్రకటించి.. తిరిగి పంపించారు. జూన్ 6వ తేదీన ఈ ఘటన జరిగింది. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, భద్రతా డేటా మ్యాచ్ లేదంటే వెట్టింగ్ ప్రాసెస్‌లో వచ్చిన సందేహాల ఆధారంగా తీసుకుంటారు. అయితే ఆర్టాన్ విషయంలో ఖచ్చితమైన కారణాన్ని అధికారులు బహిర్గతం చేయకపోవడంతో వివాదం మొదలైంది.
ఈ క్రమంలో తమ వైపు నుంచి వివరణ ఇస్తూ అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్.. ఇది సాధారణ భద్రతా తనిఖీల్లో భాగమేనని, అవసరమైన వెట్టింగ్ ప్రక్రియ కారణంగానే ప్రవేశం నిరాకరించాల్సి వచ్చిందని పేర్కొంది. అంతర్జాతీయ ఈవెంట్ అధికారుల విషయంలో కూడా భద్రతా ప్రోటోకాల్‌లు కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది.
ఈ ఘటనపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ వర్గాల్లో విమర్శలు కూడా వచ్చాయి. ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్‌కు అధికారికంగా ఎంపికైన రిఫరీకి ఇలా ప్రవేశం నిరాకరించడం సరైన చర్య కాదని పలువురు అభిప్రాయపడ్డారు.
అయితే.. వరల్డ్‌కప్‌లో అంపైరింగ్ చేసే అవకాశం కోల్పోయినా, ఒమర్ ఆర్టాన్ కెరీర్ అక్కడితో ఆగిపోలేదు. అమెరికాలో ప్రవేశం నిరాకరించబడటంతో ఆయనకు ప్రపంచకప్ మ్యాచ్‌లను ఆఫిషియేట్ చేసే అవకాశం దక్కలేదంతే. కానీ ఆయన అనుభవం, ప్రతిభను గుర్తించిన యూరప్ ఫుట్‌బాల్ సంస్థ యూఈఎఫ్‌ఏ ఆయనకు కీలక బాధ్యతను అప్పగించింది. దీని ప్రకారం ఆర్టాన్‌కు యూఈఎఫ్‌ఏ సూపర్ కప్ మ్యాచ్‌లో రిఫరీగా పనిచేసే అవకాశం లభించింది. ఈ మ్యాచ్ సాధారణంగా యూరప్‌లోని రెండు ప్రధాన క్లబ్ టోర్నమెంట్ల విజేతల మధ్య జరుగుతుంది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ క్లబ్ మ్యాచ్‌లలో ఒకటిగా పరిగణిస్తారు.
34 ఏళ్ల ఆర్టాన్ ఆఫ్రికా ఖండంలో అత్యుత్తమ రిఫరీలలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2025లో ఆఫ్రికా ఫుట్‌బాల్ సమాఖ్య(CAF కాఫ్) రిఫరీ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా గెలుచుకున్నారు. అంతకుముందు ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్, కాఫ్ చాంపియన్స్ లీగ్ ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లకు ఆయన రిఫరీగా వ్యవహరించారు.
ఫిఫా షాక్‌తో స్వదేశానికి తిరిగి వచ్చిన ఆర్టాన్‌కు సోమాలియాలో ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో వందలాది అభిమానులు, అధికారులతో కలిసి ఆయనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టాన్ మాట్లాడుతూ వచ్చే వరల్డ్‌కప్‌లో తప్పకుండా పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. “దేవుని ఆశీస్సులతో తదుపరి టోర్నమెంట్‌లో ఉంటాను” అని ఆయన పేర్కొన్నారు.


