breaking news
Entry Ban
-
ఫిఫా షాక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన ఒమర్ ఆర్టాన్
ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిఫా వరల్డ్‌కప్‌లో మ్యాచ్‌లను నిర్వహించాల్సిన ఓ రిఫరీకి ఊహించని అవమానం ఎదురైంది. సోమాలియాకు చెందిన ప్రముఖ రిఫరీ ఒమర్ అబ్దుల్కదీర్ ఆర్టాన్‌కు అమెరికాలోకి ప్రవేశం నిరాకరించారు. అందుకు సరైన కారణాలేవీ చూపించకపోవడమూ తీవ్ర దుమారం రేపింది. దీంతో.. ఆయన ప్రపంచకప్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఈ పరిస్థితుల్లోనూ ఆయనోక బంపర్ ఆఫర్ తగిలింది.. సోమాలియా రిఫరీ ఓమర్ ఆర్టాన్‌కు అమెరికాలో ఊహించని షాక్ ఎదురైంది. మియామీ ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆయన్ని.. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఆయన్ని ఆపేసి విచారణ పేరుతో 11 గంటలపాటు ప్రశ్నించారు. ఈ విచారణలో ఆయన ప్రయాణ ఉద్దేశ్యం, ప్రపంచకప్‌లో తన అధికారిక బాధ్యతలు, అలాగే సోమాలియాలోని రాజకీయ పరిస్థితులు, భద్రతా నేపథ్యం వంటి అంశాలపై అధికారులు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. అంతేకాకుండా సోమాలియాలో క్రియాశీలంగా ఉన్న అల్-షబాబ్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. విచారణ అనంతరం అధికారులు ఆయనను ‘అమెరికాలో ప్రవేశానికి అనర్హుడు’ (inadmissible)గా ప్రకటించి.. తిరిగి పంపించారు. జూన్ 6వ తేదీన ఈ ఘటన జరిగింది. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, భద్రతా డేటా మ్యాచ్ లేదంటే వెట్టింగ్ ప్రాసెస్‌లో వచ్చిన సందేహాల ఆధారంగా తీసుకుంటారు. అయితే ఆర్టాన్ విషయంలో ఖచ్చితమైన కారణాన్ని అధికారులు బహిర్గతం చేయకపోవడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో తమ వైపు నుంచి వివరణ ఇస్తూ అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్.. ఇది సాధారణ భద్రతా తనిఖీల్లో భాగమేనని, అవసరమైన వెట్టింగ్ ప్రక్రియ కారణంగానే ప్రవేశం నిరాకరించాల్సి వచ్చిందని పేర్కొంది. అంతర్జాతీయ ఈవెంట్ అధికారుల విషయంలో కూడా భద్రతా ప్రోటోకాల్‌లు కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది.ఈ ఘటనపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ వర్గాల్లో విమర్శలు కూడా వచ్చాయి. ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్‌కు అధికారికంగా ఎంపికైన రిఫరీకి ఇలా ప్రవేశం నిరాకరించడం సరైన చర్య కాదని పలువురు అభిప్రాయపడ్డారు.అయితే.. వరల్డ్‌కప్‌లో అంపైరింగ్ చేసే అవకాశం కోల్పోయినా, ఒమర్ ఆర్టాన్ కెరీర్ అక్కడితో ఆగిపోలేదు. అమెరికాలో ప్రవేశం నిరాకరించబడటంతో ఆయనకు ప్రపంచకప్ మ్యాచ్‌లను ఆఫిషియేట్ చేసే అవకాశం దక్కలేదంతే. కానీ ఆయన అనుభవం, ప్రతిభను గుర్తించిన యూరప్ ఫుట్‌బాల్ సంస్థ యూఈఎఫ్ఏ ఆయనకు కీలక బాధ్యతను అప్పగించింది. దీని ప్రకారం ఆర్టాన్‌కు యూఈఎఫ్ఏ సూపర్ కప్ మ్యాచ్‌లో రిఫరీగా పనిచేసే అవకాశం లభించింది. ఈ మ్యాచ్ సాధారణంగా యూరప్‌లోని రెండు ప్రధాన క్లబ్ టోర్నమెంట్ల విజేతల మధ్య జరుగుతుంది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ క్లబ్ మ్యాచ్‌లలో ఒకటిగా పరిగణిస్తారు.34 ఏళ్ల ఆర్టాన్ ఆఫ్రికా ఖండంలో అత్యుత్తమ రిఫరీలలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2025లో ఆఫ్రికా ఫుట్‌బాల్ సమాఖ్య(CAF కాఫ్) రిఫరీ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా గెలుచుకున్నారు. అంతకుముందు ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్, కాఫ్ చాంపియన్స్ లీగ్ ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లకు ఆయన రిఫరీగా వ్యవహరించారు.ఫిఫా షాక్‌తో స్వదేశానికి తిరిగి వచ్చిన ఆర్టాన్‌కు సోమాలియాలో ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో వందలాది అభిమానులు, అధికారులతో కలిసి ఆయనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టాన్ మాట్లాడుతూ వచ్చే వరల్డ్‌కప్‌లో తప్పకుండా పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. “దేవుని ఆశీస్సులతో తదుపరి టోర్నమెంట్లో ఉంటాను” అని ఆయన పేర్కొన్నారు. -
Bharat Jodo Nyay Yatra: ఆలయంలోకి రాహుల్ ప్రవేశం నిరాకరణ
నగావ్: అస్సాంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో సోమవారం హైడ్రామా నడిచింది. నగావ్ జిల్లా బోర్డువాలోని శ్రీశ్రీ శంకర్ దేవ్ సాత్ర ఆలయంలోకి రాహుల్ ప్రవేశాన్ని అధికారులు నిరాకరించడం ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం స్థానిక ఆలయంలో పూజల తర్వాత రాహుల్ జోడో యాత్ర ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం, పార్టీ నేతలతో కలిసి వస్తుండగా హైబొరాగావ్లో అధికారులు వారిని అడ్డుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాత్రమే ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉందని చెప్పారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంలోకి దారి తీసే అన్ని రోడ్లను దిగ్బంధించారు. మీడియాను సైతం రానివ్వలేదు. నిరసనగా రాహుల్, కాంగ్రెస్ మహిళా నేతలు అక్కడ బైటాయించారు. తనను ఎందుకు అడ్డుకున్నారో తెలపాలంటూ అధికారులను నిలదీశారు. ఎవరు, ఎప్పుడు ఆలయంలోకి వెళ్లాలో కూడా ఇప్పుడు ప్రధాని మోదీయే నిర్ణయిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఆలయంలోకి ప్రతి ఒక్కరూ వెళ్లొచ్చు కానీ, తను వెళ్తే శాంతిభద్రతల సమస్య వస్తుందంటూ అడ్డుకోవడం వింతగా ఉందని మండిపడ్డారు. పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్, బటద్రవ ఎమ్మెల్యే శిబమోని బోరా మాత్రమే ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి, వచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ముందు ఆలయంలో ప్రవేశా నికి అనుమతివ్వడం లేదని శనివారం ఆలయ కమిటీ తెలిపింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం పూర్తవడా నికి ముందు ఆలయంలోకి రావొద్దంటూ రాహుల్‌కు విజ్ఞప్తి చేసినట్లు సీఎం శర్మ చెప్పారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న శంకరదేవ ఆలయంలోకి రాహుల్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. జనవరి 11వ తేదీన రాహుల్‌కు అనుమతిచ్చిన ఆలయ అధికారులు, 20వ తేదీన మాత్రం మాటమార్చారని చెప్పారు. మోరిగావ్‌లో పాదయాత్రకు అనుమతి లేదు సంఘ వ్యతిరేక శక్తులు శాంతిభద్రతలు, సామరస్య వాతావరణానికి భంగం కలిగించే ప్రమాదం ఉన్నందున మోరిగావ్ జిల్లాలో భారత్ జోడో న్యాయ్ యాత్ర, ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించరాదని కాంగ్రెస్ నిర్వాహకులను కోరినట్లు జిల్లా కమిషనర్ దేవాశీష్ శర్మ తెలిపారు. బిహుతోలి పోలీస్ స్టేషన్ సమీపంలో ర్యాలీ, మోరిగావ్‌లోని శంకరదేవ చౌక్ నుంచి పాదయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ ముందుగా నిర్ణయించిందని ఆయన తెలిపారు. మోరిగావ్ జిల్లా నుంచి గోల్సెపాకు చేరే వరకు రాహుల్ వాహన శ్రేణిని ఎక్కడా ఆపరాదని ఆయన కోరారు. స్థానిక యంత్రాంగం, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రాహుల్ వాహనం వీడి వెళ్లరాదని స్పష్టం చేశారు. మోరిగావ్ జిల్లా భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంబంధించి గతంలో ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేసినట్లు వివరించారు. -
ఆ దేశంలో విదేశీయుల రాకపై 14 రోజుల పాటు ఆంక్షలు..!
జెరూసలేం: కోవిడ్ మహమ్మారి ఉధృతి పెరుగుతున్న కారణంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం విదేశీయుల రాకపై తాజాగా ఆంక్షలను విధించింది. అర్ధరాత్రి కాబినెట్ సమావేశం తర్వాత ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా కథనాల ప్రకారం.. ఆదివారం నుంచి మొత్తం14 రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయని, ఫోన్-ట్రాకింగ్ ద్వారా క్వారంటైన్లో ఉన్న వ్యక్తులను గుర్తిస్తామని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. ఐతే దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కారణంగా 50 ఆఫ్రికన్ దేశాలను ఇప్పటికే రెడ్ లేబుల్ కింద గుర్తించబడ్డాయి. ఆంక్షల్లో భాగంగా ఆయా దేశాలకు ఇజ్రాయెల్ ప్రజలు ప్రయాణించడాన్ని నిషేధించడం జరిగింది. ఆఫ్రికా ఖండం నుండి వచ్చే ఇజ్రాయెలీయులను కూడా క్యారంటైన్లో ఉండాలని తెల్పింది. దీంతో మూసివేసిన క్వారంటైన్ హోటళ్లన్నీ తిరిగి తెరచుకోనున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నఫ్తాలి బెన్నెట్ మీడియాకు తెలిపారు. కాగా ఇప్పటికే కొత్తవేరియంట్ తాలూకు కేసులు యూకే, యూరోపియన్ దేశాలలో వెలుగుచూసిన సంగతి తెలిసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ఉధృతిని అరికట్టడానికి అనేక దేశాలు అంక్షలు విధిస్తున్నాయి. ఇప్పుడు అదేబాటను ఇజ్రాయెల్ దేశం కూడా అనుసరిస్తోంది. -
ఎట్టకేలకు మహారాష్ట్ర మహిళలు సాధించారు
ముంబయి: ఎట్టకేలకు మహారాష్ట్ర మహిళలు గొప్ప విజయం సాధించారు. తమకు శని షిగ్నాపూర్లోని శని ఆలయంలోకి అడుగుపెట్టే అవకాశాన్ని పొందారు. ఉగాది పర్వదినం సందర్భంగా మహిళలు శుక్రవారం ఆలయంలోకి ప్రవేశించవచ్చని ఆలయ ట్రస్టు అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా మహిళ భక్తులు వరుసకట్టారు. గత చాలాకాలంగా మహిళలకు ఆలయంలోకి ప్రవేశం లేదని ఆలయ అధికారులు చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద పోరాటం కూడా జరిగి కోర్టు దాకా వెళ్లింది. ఈ అంశంపై స్పందించిన ముంబయి కోర్టు స్త్రీలు, పురుషులు సమానమేనని, ఆలయ ప్రవేశాల విషయంలో వివక్ష చూపరాదని పేర్కొన్న నేపథ్యంలో ఆలయ కట్టుబాట్లు దెబ్బతినకుండా ఉండేందుకు పురుషులకు కూడా నిషేధం విధించారు. దీంతో స్త్రీలకు, పురుషులకు ఆలయ ప్రవేశం నిషిద్ధం అయింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వారు కూడా ఆలయంలోకి వెళ్లలేకపోయారు. కానీ, గుడి పడ్వా(మహారాష్ట్రలో ఉగాది పండుగ పేరు) సందర్భంగా వందమంది పురుషులు ట్రస్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా బలవంతంగా ఆలయం లోపలికి చొచ్చుకెళ్లారు. గర్భగుడి వద్దకు వెళ్లి జలార్చన చేయడం ప్రారంభించారు. ఈ వార్తా బయటకు వ్యాపించిన నిమిషాల్లోనే ఈరోజు మహిళలకు కూడా అనుమతినిస్తున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. -
ఆ దర్గాలో మహిళల రాకపై నిషేధం కొనసాగింపు!
ముంబై: హజి అలీ దర్గా పరమ పవిత్ర గర్భగుడిలోకి మహిళలు ప్రవేశించకుండా విధించిన నిషేధంపై నిర్ణయం తీసుకొనే విషయంలో బొంబాయి హైకోర్టు నిగ్రహం పాటించింది. దర్గా గర్భగుడిలోకి రాకుండా మహిళలను నిషేధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం వాదనలు విన్నది. ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ 'ఈ రోజున్న వాతావరణంలో ప్రతి అంశాన్ని మరో అర్థం తీసుకునే పరిస్థితి నెలకొంది. ఇది అసహన యుగం. మత విషయాల్లో ప్రజలు మరీ సున్నితంగా మారిపోయారు' అని పేర్కొంది. దక్షిణ ముంబైలోని వర్లీలో హజి అలీ దర్గా నెలకొని ఉంది. ఈ దర్గాలో 15వ శతాబ్దానికి చెందిన సూఫీ సాధువు హజి అలీ సమాధి ఉంది. ఈ దర్గా గర్భగుడిలోకి రాకుండా మహిళలపై ఉన్న నిషేధం విషయంలో వివాదాన్ని పరిష్కరించాలని, నిబంధనలను మార్చే విషయమై పునరాలోచించాలని గత విచారణ సందర్భంగా హైకోర్టు దర్గా ట్రస్టులకు సూచించింది. ఈ మేరకు సమావేశమైన దర్గా ట్రస్టీలు మహిళలపై నిషేధం కొనసాగించాలని నిర్ణయించినట్టు కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసులో వాదనలను హైకోర్టు డిసెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది.


