T20: బంగ్లాదేశ్‌కు ఊహించని షాకిచ్చిన పసికూన.. సిరీస్‌ సొంతం | Sakshi
Sakshi News home page

T20: బంగ్లాదేశ్‌కు ఊహించని షాకిచ్చిన పసికూన.. సిరీస్‌ సొంతం

Published Fri, May 24 2024 11:23 AM

USA Beat Bangladesh 2nd T20 Won Series Script History in T20I Cricket

టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పసికూన యూఎస్‌ఏ చేతిలో షాంటో బృందానికి ఘోర పరాభవం ఎదురైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-2తో ఆతిథ్య దేశానికి సమర్పించుకుంది బంగ్లాదేశ్‌.

కాగా వెస్టిండీస్‌తో కలిసి అమెరికా ప్రపంచకప్‌-2024 నిర్వహణ హక్కులు దక్కించుకున్న విషయం తెలిసిందే. జూన్‌ 1 నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్‌ సన్నాహకాల్లో భాగంగా యూఎస్‌ఏ- బంగ్లాదేశ్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరుగుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం యూఎస్‌ఏ పర్యటనకు వెళ్లింది బంగ్లాదేశ్.

మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే
ఈ క్రమంలో తొలి టీ20లో అనూహ్య రీతిలో బంగ్లాదేశ్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది యూఎస్‌ఏ జట్టు. ఇక తాజాగా రెండో టీ20లోనూ విజయం సాధించి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

యూఎస్‌ఏ స్కోరు ఎంతంటే?
హోస్టన్‌ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన యూఎస్‌కే ఓపెనర్లు స్టీవెన్‌ టేలర్‌(31), కెప్టెన్‌ మొనాక్‌ పటేల్‌(42) శుభారంభం అందించారు.

అయితే, వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఆండ్రీస్‌ గౌస్‌ డకౌట్‌ కాగా.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ ఆరోన్‌ జోన్స్‌ 35 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లలో ఒక్కరు కూడా కనీసం ఇరవై పరుగుల మార్కు అందుకోలేకపోయారు.

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో యూఎస్‌ఏ ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగుల నామమాత్రపు స్కోరు సాధించింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ సులువుగానే లక్ష్యాన్ని ఛేదిస్తుందని అంతా భావించారు.

బంగ్లా బ్యాటర్లకు చుక్కలు
కానీ యూఎస్‌ బౌలర్లు బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వీరి దెబ్బకు 19.3 ఓవర్లలో కేవలం 138 పరుగులు మాత్రమే చేసి బంగ్లాదేశ్‌ ఆలౌట్‌ అయింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్‌ నజ్ముల్‌ షాంటో 36 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. తౌహీద్‌ హృదయ్‌ 25, షకీబ్‌ అల్‌ హసన్‌ 30 పరుగులు చేశారు.

ఇక లోయర్‌ ఆర్డర్‌లో మహ్మదుల్లా 3, జకీర్‌ అలీ 4, రషీద్‌ హొసేన్‌ 9, తాంజిమ్‌ హసన్‌ సకీబ్‌ 0, షోరిఫుల్‌ ఇస్లాం 1, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ 1 పరుగు చేసి దారుణంగా విఫలమయ్యారు.

అలీ ఖాన్‌ చెలరేగడంతో
ఇక యూఎస్‌ఏ బౌలర్లలో పాకిస్తాన్‌ మూలాలున్న 33 ఏళ్ల పేసర్‌ అలీ ఖాన్ ఏకంగా మూడు వికెట్లు పడగొట్టగా.. సౌరభ్‌ నట్రావల్కర్‌ రెండు, షాడ్లే వాన్‌ రెండు, కోరే ఆండర్సన్‌, జస్దీప్‌ సింగ్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. ‌‌

ఈ క్రమంలో ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన మొనాక్‌ పటేల్‌ బృందం సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. అలీ ఖాన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

చరిత్ర సృష్టించిన యూఎస్‌ఏ
కాగా ఐసీసీ అసోసియేట్‌ దేశమైన యూఎస్‌ఏ.. టెస్టు హోదా ఉన్న దేశంపై టీ20 సిరీస్‌ గెలవడం ఇదే తొలిసారి. తద్వారా యూఎస్‌ఏ క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించగా.. బంగ్లాదేశ్‌ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఇరు జట్ల మధ్య మే 25న నామమాత్రపు మూడో టీ20 జరుగనుంది.

చదవండి: IPL 2024 SRH Vs RR: ‘ఫైనల్‌’ వేటలో...

Advertisement
 
Advertisement
 
Advertisement