బులావాయో:: ఐసీసీ అండర్ 19 వరల్డ్‌కప్‌లో భారత్ మరో విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు(శనివారం, జనవరి 24వ తేదీ) న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం నమోదు చేసింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది. దాంతో ఈ వరల్డ్‌కప్‌లో భారత్ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆపై 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 13.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌లో విజేతను డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో నిర్ణయించారు.

ఫలితంగా భారత్ ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయాన్ని అందుకుంది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ 17 ఓవర్లలో 90 పరుగులు చేస్తే విజయం సాధించినట్లు. దాంతో భారత్ అప్పటికే ముందంజలో ఉండటంతో విజయం అడ్డుకోవడానికి కివీస్‌కు ఎటువంటి చాన్స్ లేకుండా పోయింది.
భారత బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ(40: 23 బంతుల్లో 2 ఫోర్లు, 3సిక్సర్లు) మరోసారి విజృంభించి ఆడాడు. అతనికి జతగా కెప్టెన్ ఆయుష్(53: 27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దాంతో భారత్ స్కోరు 9.5 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటేసింది. అంతకుముందు భారత బౌలర్లలో అంబ్రిష్ నాలుగు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించగా, హెనిల్ పటేల్ మూడు వికెట్లతో మెరిశాడు.


