
అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్ ఫాబ్ ఫోర్‌గా (అత్యుత్తమమైన నలుగురు) కీర్తించబడుతున్నారు. అయితే వీరిలో విరాట్ కోహ్లి టెస్ట్‌లకు, టీ20లకు.. స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఫాబ్ ఫోర్‌కు బీటలు వారినట్లైంది. అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో అత్యుత్తమంగా రాణిస్తుంటేనే ఫాబ్ ఫోర్ బిరుదుకు సార్దకత ఉంటుంది.
అలాంటిది విరాట్, స్టీవ్ స్మిత్ ఆయా ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇకపై వీరిని ఫాబ్ ఫోర్‌లో సభ్యులుగా పరిగణించలేము. మిగిలిన ఇద్దరిలో రూట్, విలియమ్సన్ కూడా కెరీర్ చరమాంకంలో ఉన్నారు. పైగా వీరికి పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. వీరిద్దరితో పాటు స్టీవ్ స్మిత్ ప్రస్తుతం టెస్ట్‌ల్లో మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు.
ఫాబ్ ఫోర్‌కు బీటలు వారిన నేపథ్యంలో కొత్త ఫాబ్ ఫోర్ ఎవరనే అంశం తెరపైకి వచ్చింది. విశ్లేషకులు, మాజీలు కొత్త ఫాబ్ ఫోర్‌గా కీర్తించబడేందుకు పలానా ఆటగాళ్లు అర్హులంటూ ఎవరి అభిప్రాయాలను వారు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడ కేన్ విలియమ్సన్ కూడా కొత్త ఫాబ్ ఫోర్‌ను ప్రకటించాడు.
సొంత దేశ ఆటగాడు రచిన్ రవీంద్ర, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్, టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు కొత్త ఫాబ్ ఫోర్‌గా కీర్తించబడే అర్హతలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఆసీస్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్‌కు కూడా ఫాబ్ ఫోర్‌లో భాగమయ్యే అర్హతలున్నాయని అన్నాడు. ఈ సందర్భంగా కేన్ టెస్ట్ క్రికెట్ ప్రాముఖ్యత గురించి ప్రస్తావించాడు.
పరిమిత ఓవర్ల ఫార్మాట్లతో పాటు టెస్ట్‌ల్లో రాణిస్తేనే ఫాబ్ ఫోర్ అనిపించుకుంటారని తెలిపాడు. తాను వ్యక్తిగతంగా టెస్ట్ క్రికెట్‌కు అమితమైన ఆదరణ ఉన్న జమానాలో ఎదిగినందుకు గర్వపడుతున్నానని అన్నాడు. యువ ఆటగాళ్లు టీ20ల మాయలో పడి టెస్ట్ క్రికెట్‌ను విస్మరించకూడదని సూచించాడు.
కేన్ అంచనా వేస్తున్న నయా ఫాబ్ ఫోర్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్నారు. అయితే వీరంతా ఇదే ప్రదర్శనను సుదీర్ఘకాలం కొనసాగించగలిగితే ఫాబ్ ఫోర్ అనిపించుకుంటారు. గిల్, బ్రూక్, రచిన్, జైస్వాల్, గ్రీన్ ఆటగాళ్లుగా ఇప్పుడిప్పుడే పరిణితి చెందుతున్నారు. వీరి వయసు కూడా చాలా తక్కువ. మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ క్రికెటర్‌గా స్థిరపడేందుకు వీరికి తగినంత సమయం ఉంది. ఇప్పటివకే వీరు కెరీర్‌లో అత్యుత్తమ దశలను చూశారు.