తొలి రోజే ‘తల’పోటు...

Travis Head hits 6th Test century in WTC final  - Sakshi

156 బంతుల్లో అజేయంగా 146 పరుగులు చేసిన ట్రవిస్‌ హెడ్‌ 

స్టీవ్‌ స్మిత్‌ 95 బ్యాటింగ్‌

ఆస్ట్రేలియా 327/3

భారత్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌ 

పిచ్‌పై తేమ, కాస్త పచ్చిక, ఆకాశం మేఘావృతం... అన్నీ పేస్‌ బౌలింగ్‌కు అనుకూలించే పరిస్థితులే. రోహిత్‌ శర్మ టాస్‌ గెలిచాడు. ఈ స్థితిలో ఏ కెప్టెనైనా ఏం చేస్తాడో అతను కూడా అదే చేస్తూ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. మ్యాచ్‌ ఆరంభంలో షమీ, సిరాజ్‌ బౌలింగ్‌ చూస్తుంటే ఫీల్డింగ్‌ ఎంచుకున్న నిర్ణయం సరైందనిపించింది... ఒక గంట గడిచింది. వాతావరణం అంతా మారిపోయింది... పిచ్‌ ఒక్కసారిగా బ్యాటర్ల పక్షాన చేరింది... హెడ్, స్మిత్‌ దీనిని అద్భుతంగా వాడుకున్నారు. 

సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ ఆసీస్‌ భారీ స్కోరుకు బాటలు వేశారు. మెరుపు వేగంతో ఆడిన హెడ్‌ సెంచరీతో చెలరేగగా, స్మిత్‌ శతకానికి చేరువయ్యాడు. చివరి సెషన్‌లోనైతే మన బౌలర్లు పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి... డబ్ల్యూటీసీ ఫైనల్‌ పోరులో తొలి రోజు పూర్తిగా ఆ్రస్టేలియాదే. రెండో రోజు వారిని నిలువరించలేకపోతే భారత్‌ ఈ టెస్టుపై ఆశలు కోల్పోవాల్సిందే!  

లండన్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ మొదటి రోజును ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. భారత్‌తో బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది.

ట్రవిస్‌ హెడ్‌ (156 బంతుల్లో 146 బ్యాటింగ్‌; 22 ఫోర్లు, 1 సిక్స్‌), స్టీవ్‌ స్మిత్‌ (227 బంతుల్లో 95 బ్యాటింగ్‌; 14 ఫోర్లు) చెలరేగారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు అభేద్యంగా 251 పరుగులు జోడించారు. భారత తుది జట్టులో అశ్విన్‌కు స్థానం దక్కకపోగా, కీపర్‌గా భరత్‌కే చోటు లభించింది. ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వారి కోసం టీమిండియా ఆటగాళ్లు మౌనం పాటించగా, ఇరు జట్ల క్రికెటర్లు నల్లబ్యాండ్‌లు ధరించి బరిలోకి దిగారు.
 
రాణించిన వార్నర్‌..
పేసర్లు షమీ, సిరాజ్‌ పదునైన బంతులతో ఆసీస్‌ ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. మొదటి మూడు ఓవర్లు మెయిడిన్‌ కాగా, తర్వాతి ఓవర్లో ఫలితం దక్కింది. సిరాజ్‌ బంతిని ఆడలేక ఉస్మాన్‌ ఖ్వాజా (10 బంతుల్లో 0) కీపర్‌ భరత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి గంటలో 12 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 29 పరుగులే చేసింది.

చెరో 2 ఓవర్లు వేసిన షమీ, సిరాజ్‌ వేసిన అనేక బంతులు వార్నర్‌ (60 బంతుల్లో 43; 8 ఫోర్లు), లబుషేన్‌ (62 బంతుల్లో 26; 3 ఫోర్లు) శరీరానికి తాకాయి. అయితే ఇద్దరు బ్యాటర్లు పట్టుదలగా నిలబడి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఉమేశ్‌ ఓవర్లో నాలుగు ఫోర్లు బాది జోరు ప్రదర్శించిన వార్నర్‌ ఆ తర్వాతా దానిని కొనసాగించాడు.

ఆసీస్‌ పటిష్ట స్థితికి చేరుతున్న దశలో శార్దుల్‌ భారత్‌కు కీలక వికెట్‌ అందించాడు. లంచ్‌ సమయానికి కాస్త ముందు లెగ్‌సైడ్‌ వెళుతున్న బంతిని వార్నర్‌ వెంటాడగా భరత్‌ అద్భుతంగా అందుకున్నాడు. వార్నర్, లబుషేన్‌ రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. విరామం తర్వాత షమీ చక్కటి బంతితో లబుషేన్‌ ను బౌల్డ్‌ చేయడంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది.  

భారీ భాగస్వామ్యం... 
ఐదు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టిన టీమిండియా ఆనందాన్ని తర్వాతి భాగస్వామ్యం పూర్తిగా దెబ్బ కొట్టింది. స్మిత్, హెడ్‌ కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించారు. తాను ఎదుర్కొన్న తొలి 16 బంతుల్లోనే 6 ఫోర్లతో దూకుడు చూపించిన హెడ్‌ 60 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, రెండో సెషన్‌లో భారత్‌కు వికెట్‌ దక్కలేదు. చివరి సెషన్‌లోనూ ఈ జంట మరింత పట్టుదలగా ఆడింది. 144 బంతుల్లో స్మిత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయిన కొద్ది సేపటికే హెడ్‌ 106 బంతుల్లోనే కెరీర్‌లో ఆరో శతకాన్ని అందుకున్నాడు. ఇదే ఊపులో భాగస్వామ్యం 200 పరుగులు దాటగా, భారత బృందం బేలగా చూస్తుండిపోయింది. 

స్కోరు వివరాలు 
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) భరత్‌ (బి) శార్దుల్‌ 43; ఖ్వాజా (సి) భరత్‌ (బి) సిరాజ్‌ 0; లబుషేన్‌ (బి) షమీ 26; స్మిత్‌ (బ్యాటింగ్‌) 95; హెడ్‌ (బ్యాటింగ్‌) 146; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (85 ఓవర్లలో 3 వికెట్లకు) 327.  వికెట్ల పతనం: 1–2, 2–71, 3–76. 
బౌలింగ్‌: షమీ 20–3–77–1, సిరాజ్‌ 19–4– 67–1, ఉమేశ్‌ 14–4–54–0, శార్దుల్‌ 18–2– 75–1, జడేజా 14–0–48–0.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top