భారత్‌ సత్తాకు సవాల్‌

Today is a match against the Asian champion Qatar team - Sakshi

నేడు ఆసియా చాంపియన్‌ ఖతర్‌ జట్టుతో మ్యాచ్‌

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌–2026 ఆసియా క్వాలిఫయర్స్‌

రాత్రి 7 గంటల నుంచి స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం  

భువనేశ్వర్‌: సొంతగడ్డపై సమష్టి ఆటతీరుతో రాణించి ఆసియా చాంపియన్‌ ఖతర్‌ జట్టును నిలువరించాలని భారత పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు పట్టుదలతో ఉంది. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌–2026 ఆసియా క్వాలిఫయింగ్‌ టోర్నీ రెండో రౌండ్‌లో భాగంగా నేడు కళింగ స్టేడియంలో ఖతర్‌ జట్టుతో భారత్‌ తలపడనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఖతర్‌ 61వ స్థానంలో, భారత్‌ 102వ స్థానంలో ఉన్నాయి. ర్యాంక్‌ పరంగానూ, ప్రావీణ్యం పరంగానూ తమకంటే మెరుగ్గా ఉన్న ఖతర్‌ జట్టును నిలువరించాలంటే భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలి.

సునీల్‌ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు ఆసియా క్వాలిఫయింగ్‌ టోర్నీని విజయంతో ప్రారంభించింది. కువైట్‌తో ఈనెల 16న జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 1–0తో గెలిచింది. మరోవైపు ఖతర్‌ జట్టు తొలి లీగ్‌ మ్యాచ్‌లో 8–1తో అఫ్గానిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో నేడు జరిగే మ్యాచ్‌ భారతజట్టు సత్తాకు సవాల్‌గా నిలువనుంది. ఇప్పటి వరకు భారత్, ఖతర్‌ జట్లు ముఖాముఖిగా మూడుసార్లు తలపడ్డాయి.

1996లో ఖతర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 0–6తో ఓడిన టీమిండియా, 2019లో రెండో మ్యాచ్‌ను 0–0తో ‘డ్రా’ చేసుకుంది. 2021లో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్‌ 0–1తో ఓటమి చవిచూసింది. ప్రపంచకప్‌ ఆసియా జోన్‌ క్వాలిఫయింగ్‌ గ్రూప్‌ ‘ఎ’లో భారత్, ఖతర్, కువైట్, అఫ్గానిస్తాన్‌ ఉన్నాయి. ఇంటా బయటా పద్ధతిలో ఒక్కో జట్టు మిగతా మూడు జట్లతో మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం టాప్‌–2లో నిలిచిన రెండు జట్లు ప్రపంచకప్‌ మూడో రౌండ్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీకి అర్హత సాధిస్తాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top