
సాక్షి క్రీడా విభాగం : నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ... భారత క్రికెట్‌లో రాబోయే కొన్నేళ్లు ఈ పేరును ఎవరూ మర్చిపోలేరు. ఆసియా కప్ ఫైనల్లో అతని ఇన్నింగ్స్‌పై అభిమానుల్లో సుదీర్ఘ కాలం చర్చ సాగటం ఖాయం. టోర్నీ ఆసాంతం అసాధారణ ప్రదర్శనతో జట్టుకు వరుస విజయాలు అందించిన అభిషేక్ శర్మ ఆరంభంలోనే వెనుదిరిగాడు. సూర్య, గిల్ విఫలమయ్యారు. స్కోరు 20/3. ఇలాంటప్పుడు జట్టును గెలిపించేదెవరు అని భారత అభిమానుల్లో ఒక రకమైన ఆందోళన. ఈ స్థితిలో నేనున్నానంటూ తిలక్ నిలబడ్డాడు.
తీవ్రమైన ఒత్తిడి, మరో వికెట్ పడితే మ్యాచ్ చేజారిపోయే ప్రమాదం ఉంది. క్రీజ్‌లో నిలబడి జాగ్రత్తగా ఆడాలా, లేక భారీ షాట్లకు పోవాలా అనే సందేహాల నడుమ అతని ఇన్నింగ్స్ ప్రారంభమైంది. కానీ తిలక్ ఏమాత్రం తడబడలేదు. సామ్సన్ వెనుదిరిగినా, జాగ్రత్తగా ఆడుతూ అవకాశం లభించగానే చెలరేగిపోయాడు. ఫహీమ్ ఓవర్లోనే వరుసగా ఫోర్, సిక్స్‌తో తన ఉద్దేశాన్ని చాటిన అతను, అబ్రార్ ఓవర్లో సిక్స్‌తో అందరిలో గెలుపు నమ్మకాన్ని పెంచాడు.
రవూఫ్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో స్కోరును 100 దాటించడంతో మ్యాచ్ నియంత్రణలోకి వచ్చేసింది. మరోవైపు దూబే దూకుడుగా ఆడిన సమయంలో తాను కాస్త సంయమనం పాటించాడు. 8 పరుగులు చేయాల్సిన దశలో డీప్ స్క్వేర్ లెగ్ వైపు కొట్టిన భారీ సిక్సర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ తర్వాత గెలుపు సంబరాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.
దాదాపు పది నెలల క్రితం...దక్షిణాఫ్రికా గడ్డపై తిలక్ వర్మ వరుసగా రెండు టి20ల్లో సెంచరీలతో చెలరేగాడు. ఆ తర్వాత భారత్‌కు రాగానే ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా మరో శతకం బాది... టి20 క్రికెట్‌లో వరుసగా మూడు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత చెన్నైలో ఇంగ్లండ్‌పై అజేయంగా చేసిన 72 పరుగులు అతని సత్తాను మరోసారి చూపించాయి. అయితే కొద్ది రోజులకే ఐపీఎల్‌లో అతనికి అవమానకర స్థితి ఎదురైంది. మూడు సీజన్ల పాటు ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
ఈ సీజన్‌లో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ అనూహ్య నిర్ణయం తిలక్‌ను షాక్‌కు గురి చేసింది. 23 బంతుల్లో 25 పరుగులు చేయడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ‘రిటైర్డ్ అవుట్’తో తిలక్‌ను బయటకు పంపించారు. అదృష్టవశాత్తూ ఐపీఎల్‌లో ప్రదర్శన అతని అంతర్జాతీయ కెరీర్‌పై ప్రభావం చూపించలేదు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత సహజంగానే ఈ సారి ఆసియా కప్ టీమ్‌లో అతనికి స్థానం లభించింది.
వరుసగా చక్కటి ఇన్నింగ్స్‌లతో తన ముద్ర చూపించిన అతను లంకతో చివరి మ్యాచ్‌లో త్రుటిలో అర్ధ సెంచరీ కోల్పోయాడు. అయితే తన విశ్వరూపం చూపించాల్సింది ఇక్కడ కాదు అన్నట్లుగా అత్యుత్తమ ప్రదర్శనను ఫైనల్ కోసం దాచి ఉంచినట్లున్నాడు. అసాధారణ షాట్లతో జట్టుకు ఆసియా కప్ అందించే వరకు ఆగకుండా తానేంటో నిరూపించుకొని తిలక్ సగర్వంగా నిలిచాడు.
ఫైనల్ మ్యాచ్‌కు ముందు తిలక్ కెరీర్‌లో 30 మ్యాచ్‌ల అంతర్జాతీయ టి20 కెరీర్‌లో 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఎన్నో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు కూడా ఉన్నాయి. కానీ ఈ మ్యాచ్‌లో ఆడిన ఆట అన్నింటికంటే శిఖరాన నిలుస్తుంది. ఇప్పటికే 49.61 సగటు, 150.84 సగటుతో దూసుకుపోతున్న తిలక్ ఈ ఫార్మాట్‌లో మున్ముందు మరిన్ని సంచలన ప్రదర్శనలు చూపించడం ఖాయం.
