
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో (Asia cup 2025 Final) పాకిస్తాన్‌పై భారత్ (India vs Pakistan) విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు.
147 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో తిలక్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 53 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఫహీమ్ అష్రఫ్ ధాటికి టాపార్డర్ కుప్పకూలిన వేల తిలక్ ప్రశాంతంగా, సమర్థంగా ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించాడు. సంజు శాంసన్, శివమ్ దూబేతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. బౌండరీలు, సిక్సర్లు బాదడంతో పాటు స్ట్రైక్ రొటేషన్‌లో తన నైపుణ్యాన్ని చూపించాడు. ఈ ఇన్నింగ్స్‌కు గానూ తిలక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సూపర్ సిక్సర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు లభించాయి.
ఈ టోర్నీలో తిలక్ 7 మ్యాచ్‌ల్లో 71.00 సగటున, 131.48 స్ట్రైక్ రేట్‌తో 213 పరుగులు చేశాడు. మొత్తం T20I కెరీర్‌లో 32 మ్యాచ్‌లు ఆడిన తిలక్.. 53.44 సగటున, 149.14 స్ట్రైక్ రేట్ 962 పరుగులు చేశాడు.
కోహ్లీని అధిగమించిన తిలక్
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తిలక్ వర్మ 30 T20I ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక సగటు కలిగిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీని (Virat Kohli) అధిగమించాడు.
30 T20I ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక సగటు కలిగిన భారత బ్యాటర్లు:
తిలక్ వర్మ- 53.4
విరాట్ కోహ్లీ- 50.7
మనీష్ పాండే- 43.1
కేఎల్ రాహుల్- 41.9
సూర్యకుమార్ యాదవ్- 39.0
ఛేజింగ్‌లో మొనగాడు
అంతర్జాతీయ టీ20ల్లో తిలక్‌కు ఛేజింగ్‌లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. 11 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 92.50 సగటున, 134.54 స్ట్రైక్ రేట్‌తో 370 పరుగులు చేశాడు. ఛేజింగ్‌లో ఇంత అద్భుతమైన సగటు చాలా తక్కువ మందికి ఉంది.
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన తిలక్ వర్మ, క్రమంగా భారత జట్టులో నమ్మకమైన మిడిలార్డర్ బ్యాటర్‌గా ఎదిగాడు. ఒత్తిడిలో ఇన్నింగ్స్ నిర్మించడం, మ్యాచ్ ఫినిష్ చేయడం వంటి అంశాల్లో తిలక్ ఇప్పటికే తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు.
ఇదిలా ఉంటే, నిన్న (సెప్టెంబర్ 28) జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాక్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, 9వ సారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది.
ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.
అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం ఆదిలో తడబడినప్పటికీ.. తిలక్ వర్మ అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్‌కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు.
చదవండి: Asia Cup 2025: సూర్యకుమార్ యాదవ్ చేశాడని పాకిస్తాన్ కెప్టెన్ కూడా..!