Asia Cup 2025: సూర్యకుమార్‌ యాదవ్‌ చేశాడని పాకిస్తాన్‌ కెప్టెన్‌ కూడా..! | Inspired by SKY, Agha Salman donates Asia Cup match Fee to Operation Sindoor victims | Sakshi
Sakshi News home page

Asia Cup 2025: సూర్యకుమార్‌ యాదవ్‌ చేశాడని పాకిస్తాన్‌ కెప్టెన్‌ కూడా..!

Sep 29 2025 3:13 PM | Updated on Sep 29 2025 3:39 PM

Inspired by SKY, Agha Salman donates Asia Cup match Fee to Operation Sindoor victims

నిన్న (సెప్టెంబర్‌ 28) జరిగిన ఆసియా కప్‌ 2025 ఫైనల్లో (Asia cup 2025) భారత్‌ పాకిస్తాన్‌ను (India vs Pakistan) చిత్తుగా ఓడించి 9వ సారి టైటిల్‌ను (వన్డే, టీ20) కైవసం చేసుకుంది. టీమిండియా (Team India) టైటిల్‌ గెలిచిన అనంతరం చాలా హైడ్రామా చోటు చేసుకుంది.

భారత ఆటగాళ్లు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌కు ఛైర్మన్‌గా ఉన్న పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకునేందుకు నిరాకరించారు. దీనికి ప్రతిగా నఖ్వీ టీమిండియాకు ఇవ్వాల్సిన ట్రోఫీని, మెడల్స్‌ను ఎత్తుకెళ్లిపోయాడు.

భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండా సంబురాలు చేసుకొని నఖ్వీ పుండుపై కారం చల్లారు. మధ్యలో పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ అఘా నఖ్వీ చేతి నుంచి అందుకున్న రన్నరప్‌ చెక్‌ను అక్కడే పడేసి ఓవరాక్షన్‌ చేశాడు. పహల్గాం ఉగ్రవాడికి ప్రతిగా భారత ఆటగాళ్లు ఈ టోర్నీ ఆరంభం నుంచి పాక్‌ ఆటగాళ్లకు హ్యాండ్‌ షేక్‌ను నిరాకరించిన విషయం తెలిసిందే. ఫైనల్‌ సహా ఇరు జట్లు తలపడిన మూడు సందర్భాల్లో ఇదే జరిగింది.

ఈ హైడ్రామా నడుమ టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) సంచలన నిర్ణయం తీసుకొని పాకిస్తానీల గుండెల్లో​ అగ్గి రాజేస్తూ, తన దేశభక్తిని చాటుకున్నాడు. ఆసియా కప్‌ ద్వారా అతనికి లభించబోయే మ్యాచ్ ఫీజ్‌ మొత్తాన్ని పహల్గాం ఉగ్రదాడిలో బాధిత కుటుంబాలకు, అలాగే భారత సాయుధ దళాలకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.

స్కై తీసుకున్న ఈ నిర్ణయంపై యావత్‌ భారతావణి హర్షం వ్యక్తం చేస్తుంది. భారతీయులంతా స్కైను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. స్కైను కాపీ కొడుతూ పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ అఘా (Salman Agha) 'ఆపరేషన్ సిందూర్' బాధితులకు తన ఆసియా కప్‌ మ్యాచ్‌ ఫీజ్‌ మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.

కాగా, నిన్న జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌పై టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌.. కుల్దీప్‌ యాదవ్‌ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.

అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌ సైతం తడబడింది. అయితే తిలక్‌ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్‌ (24), శివమ్‌ దూబే (33) తిలక్‌కు సహకరించారు. రింకూ సింగ్‌ బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు.

చదవండి: Asia Cup: సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం..


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement