
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన దేశభక్తిని చాటుకున్నాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో తను ఆడిన మ్యాచ్‌ల ఫీజుల మొత్తాన్ని భారత సైన్యంతో పాటు పహల్గాం ఉగ్రదాడిలో బాధితులైన కుటుంబాలకు సూర్య విరాళంగా ఇచ్చాడు.
ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ అనంతరం సూర్య తన నిర్ణయాన్ని వెల్లడించాడు. "ఆసియాకప్ టోర్నీలో వచ్చే నా మొత్తం మ్యాచ్ ఫీజును పహల్గామ్ ఉగ్రవాద దాడిలో బాధితులైన కుటంబాలకు, మన సాయుధ దళాలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మీరు ఎల్లప్పుడూ నా ఆలోచనలలో ఉంటారు. జై హింద్." అని ఎక్స్‌లో స్కై పేర్కొన్నాడు.
ఈ ఖండాంతర టోర్నీలో మిస్టర్ 360 మొత్తం 7 మ్యాచ్‌లు ఆడాడు. ఒక్కో మ్యాచ్‌కు రూ. 4 లక్షలు అందుకుంటున్నాడు. ఈ ఏడు మ్యాచ్‌లకు గానూ రూ.28 లక్షలు మ్యాచ్ ఫీజు రూపంలో సూర్యకి దక్కనుంది. అయితే పాకిస్తాన్‌పై లీగ్ మ్యాచ్ విజయాన్ని సాయుధ దళాలకు అంకితం చేసినందుకు సూర్య మ్యాచ్ ఫీజులో ఐసీసీ 30 శాతం కోత విధించింది.
దీంతో అతడు రూ. 26.80 లక్షలు డొనేట్ చేయనున్నాడు. కాగా ఆదివారం జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాక్‌ను భారత్ ఓడించింది. టీమిండియా ఆసియాకప్‌ను కైవసం చేసుకోవడం ఇది ఏడోసారి కావడం విశేషం. పాక్‌పై గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.
కాగా టోర్నీ ఆరంభం నుంచే పాకిస్తాన్‌పై భారత్ తమ నిరసనను తెలియజేసింది. పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ టోర్నీ మొత్తంగా పాక్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయలేదు. ఆఖరికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని కూడా భారత్ తీసుకోలేదు.
చదవండి: Asia Cup 2025: ట్రోఫీ, మెడల్స్‌ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్.. బీసీసీఐ సీరియస్