Photo Credit: Twitter
గౌహతి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోరు సాధించింది. ముగ్గురు బ్యాటర్లు సెంచరీలతో విరుచుకుపడడంతో వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. అమిర్ జాంగో (77 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), జాన్ క్యాంప్‌బెల్ (68 బంతుల్లో 101; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ షెయ్ హోప్ (94 బంతుల్లో 104; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత శతకాలు సాధించి భారీ స్కోరుకు బాటలు వేశారు.
చివర్లో రోస్టన్ చేజ్ (25 బంతుల్లో 29 నాటౌట్) ధాటిగా ఆడడంతో వెస్టిండీస్ 400 పరుగుల మార్క్‌ను దాటింది. భారత బౌలర్లలో అందరూ దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజాలు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఇది రెండోసారి..
ఇక వన్డేల్లో భారత్‌తో మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు తరఫున ముగ్గురు శతకాలు సాధించడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో 2015లో ముంబై వేదికగా భారత్‌తో జరిగిన ఐదో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు క్వింటన్ డికాక్ (109), డుప్లెసిస్ (133), డివిలియర్స్ (119) శతకాలతో చెలరేగారు. తాజా వన్డేలో విండీస్ తరఫున క్యాంప్‌బెల్, హోప్, అమీర్ జాంగోలు సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. ఇక వన్డే క్రికెట్ చరిత్రలో సౌతాఫ్రికా ఈ ఫీట్‌ను మూడుసార్లు నమోదు చేయడం విశేషం.
405- ఇక వెస్టిండీస్‌కు వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. గతంలో 389 పరుగులే ఆ జట్టుకు అత్యుత్తమం. 2019లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో విండీస్ 389 పరుగులు చేసింది. 2025లో ఐర్లాండ్‌తో వన్డేలో 385 పరుగులు చేసింది.
ఇదీ చదవండి: వెస్టిండీస్ కెప్టెన్ ప్రపంచ రికార్డు


