
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌కు ‘హ్యాట్రిక్’ పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన తొలి పోరులో టైటాన్స్ 29–33 పాయింట్ల తేడాతో దబంగ్ ఢిల్లీ చేతిలో ఓడింది. టైటాన్స్‌కు ఇది వరుసగా మూడో పరాజయం కాగా... ఆడిన ఆరో మ్యాచ్‌లోనూ గెలిచిన దబంగ్ ఢిల్లీ 12 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. లీగ్‌లో భాగంగా వైజాగ్‌లో ‘హ్యాట్రిక్’ విజయాలు నమోదు చేసుకున్న తెలుగు టైటాన్స్ జట్టు... పోటీలు జైపూర్‌కు తరలిన తర్వాత ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు.
తాజా పోరులో టైటాన్స్ తరఫున కెప్టెన్ విజయ్ మలిక్ 5 పాయింట్లు సాధించగా... మన్‌జీత్, అజిత్ పవార్ చెరో 4 పాయింట్లు సాధించారు. మరోవైపు దబంగ్ ఢిల్లీ తరఫున నీరజ్ నర్వాల్ 9 పాయింట్లు సాధించగా... సౌరభ్, ఫజల్ ఐదేసి పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో టైటాన్స్ 13 రెయిడ్ పాయింట్లు సాధించగా... ఢిల్లీ 15 ఖాతాలో వేసుకుంది. ట్యాక్లింగ్‌లో టైటాన్స్‌కు 12 పాయింట్లు దక్కగా... ఢిల్లీ 15 పాయింట్లతో ముందంజ వేసింది.
తాజా సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన టైటాన్స్ 3 విజయాలు, 5 పరాజయాలతో ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 8వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 43–32 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్‌పై గెలుపొందింది. హర్యానా తరఫున శివమ్ 15 పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. పట్నా పైరెట్స్ తరఫున అయాన్ 7 పాయింట్లతో పోరాడాడు. లీగ్‌లో భాగంగా గురువారం జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగాల్ వారియర్స్, యు ముంబాతో పుణేరి పల్టన్ ఆడతాయి.