
జిల్లా నుంచి దులీప్ ట్రోఫీకి ఎంపికై న మొట్టమొదటి క్రికెటర్‌గా గుర్తింపు
బీసీసీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌లో జరగనున్న పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: టెక్కలికి చెందిన క్రికెటర్ త్రిపురాన విజయ్ మరో మెగా టోర్నీకి ఎంపికయ్యాడు. బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో మెరవనున్నాడు. ఈ పోటీలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి. జిల్లా నుంచి దులీప్ ట్రోఫీకి ఎంపికై న మొట్టమొదటి జిల్లా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. సౌత్‌జోన్ జట్టుకు ఆంధ్రా నుంచి ఇద్దరు క్రికెటర్లు ఎంపిక కాగా.. అందులో విశాఖకు చెందిన రిక్కీబుయ్ ఒకరు కాగా.. మరొకరు త్రిపురాన విజయ్ కావడం గమనార్హం.
2023–24 సీజన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ అయిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో 26 వికెట్లు సాధించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. రంజీ మ్యాచ్‌లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా దులీప్ ట్రోఫీకి ఎంపికై నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎంపికై అందర్నీ ఆశ్చర్యపరిచిన విజయ్ తాజాగా ఏపీఎల్ నాల్గో సీజన్‌లో రికార్డు స్థాయిలో రూ. 7.55 లక్షలు దక్కించుకున్నాడు. రైటార్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్, మిడిలార్డర్ బ్యాటింగ్‌తోపాటు బెస్ట్ ఫీల్డర్‌గా రాణిస్తున్నాడు. విజయ్ తల్లిదండ్రులు వెంకటకృష్ణరాజు, లావణ్య టెక్కలిలోని అయ్యప్పనగర్ కాలనీలో నివాసం ఉంటారు. తండ్రి సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. విజయ్ ప్రస్తుతం టెక్కలిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు.
చాలా సంతోషంగా ఉంది
దులీప్ ట్రోఫీకి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో నిలకడగా రాణించి జట్టు విజయాల్లో భాగస్వామ్యం అవుతాను. త్వరలో జరగనున్న ఏపీఎల్‌లో రాణించేందుకు కఠోర సాధన చేస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, కోచ్‌లు, సంఘ పెద్దలకు కృతజ్ఞతలు.
– త్రిపురాన విజయ్, క్రికెటర్