వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

Feb 13 2026 5:28 AM | Updated on Feb 13 2026 5:28 AM

వెనుక

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

శ్రీకాకుళం: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్‌, పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించామని సమగ్ర శిక్ష ఏపీసీ పి.వేణుగోపాలరావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 25 కేజీబీవీలలో పదో తరగతిలో 1044 మంది, ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో 892 మంది, సెకెండియర్‌లో 778 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు. శతశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అదనపు గదుల పనులు మార్చి 15 నాటికి పూర్తవుతాయని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి వసతి సమస్య ఉండదని చెప్పారు. ఇటీవల ఏడుగురు సైట్‌ ఇంజినీర్లు బదిలీ కాగా, వారి బదులుగా సచివాలయాల్లోని పదిమంది ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను సమగ్ర శిక్షకు జిల్లా ఉన్నతాధికారులు కేటాయించారని తెలిపారు.

లింగ నిర్ధారణ నేరం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ : లింగ నిర్ధారణ నివారణ, చట్టపరమైన అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని శ్రీకాకుళం ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష అన్నారు. జిల్లా రెవెన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయంలో గురువారం బోర్డు మెంబర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాలికల నిష్పత్తిని పెంచడానికి లింగ నిర్ధారిత పరీక్షల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. అనంతరం ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాల వారీగా స్కానింగ్‌ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో కె.రమణమూర్తి, స్వీప్‌ ఎన్జీవో డాక్టర్‌ కిరణ్‌కుమార్‌రాజు, జీజీహెచ్‌ శ్రీకాకుళం కె.లక్ష్మి, గైనకాలజిస్ట్‌ బి.సరళకుమారి, అడ్వకేట్‌ యూత్‌ క్లబ్‌ మెంబర్‌ మోహినీ రత్నకుమారి పాల్గొన్నారు.

చిన్నారులకు గుండె జబ్బుల నిర్ధారణ శిబిరం

శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్‌ సర్వజన ఆసుపత్రిలో గురువారం చిన్నారులకు గుండె జబ్బుల నిర్ధారణ శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె.అనిత ఆదేశాల మేరకు ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శివరంజని, పీడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ పి.రాము పర్యవేక్షణలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. విశాఖపట్నం మెడికవర్‌ ఆస్పత్రి పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ అశోక్‌రాజు అత్యాధునిక పరికరాలతో ఎకో కార్డియోగ్రఫీ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండె సమస్య లు తీవ్రంగా ఉన్న చిన్నారులకు ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం ద్వారా మెడికవర్‌లో ఉచితంగా ఆపరేషన్లు జరుగుతాయన్నారు. కాగా, శుక్రవారం టెక్కలి జిల్లా ఆస్పత్రిలో చిన్నారులకు గుండె జబ్బుల నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

22న సాగర సంగ్రామ దీక్ష

శ్రీకాకుళం అర్బన్‌: విశాఖపట్నంలో ఈ నెల 22న సాగర సంగ్రామ దీక్ష నిర్వహిస్తున్నట్లు ఏపీ సీపీఎస్‌ ఈఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెడ్డి సూరిబాబు, సంయుక్త కార్యదర్శి వి.వి.రాజు తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం ఎన్‌జీవో కార్యాలయ ఆవరణలో గురువారం జిల్లా జేఏసీ చైర్మన్‌ హనుమంతు సాయిరాం పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఎస్‌ అంతానికి విశాఖ కేంద్రంగా జరిగే పోరాటంలో ప్రతి ఒక్క ఉద్యోగి పాల్గొని ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే దశల వారీగా పోరాటాలు చేస్తున్నామని, వీటిని మరింత ఉద్ధృతం చేసే క్రమంలో సాగర సంగ్రామ దీక్షకు సిద్ధమైనట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ పూర్వపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భానుమూర్తి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చావల శ్రీనివాసరావు, పప్పల తిరుమలరావు, ఏపీ ఎన్‌జీవో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయి వేణుగోపాల్‌, జిల్లా కార్యదర్శి చల్లా శ్రీనివాసరావు, జిల్లా ఆర్థిక కార్యదర్శి బడగల పూర్ణచంద్రరావు, ఏపీటీఎఫ్‌(1938) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, బల్లెడ రవి, ఎస్సీ ఎస్టీ యూనియన్‌ నాయకులు బోనెల రమేశ్‌, జనసాహితి అధ్యక్షుడు మోహనరావు, ఎస్టీయూ నాయకులు చింతల రామారావు తదితరులు పాల్గొన్నారు.

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి 1
1/2

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి 2
2/2

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement