అసలే గ్యాస్‌ కొరత.. ఆపై గొడవ | - | Sakshi
Sakshi News home page

అసలే గ్యాస్‌ కొరత.. ఆపై గొడవ

Apr 4 2026 8:07 AM | Updated on Apr 4 2026 8:07 AM

ఇచ్ఛాపురం: గ్యాస్‌ కొరతతో వినియోగదారులు సహనం కోల్పోతున్నారు. శుక్రవారం స్థానిక ఇండియన్‌ గ్యాస్‌ ఏజెన్సీ కార్యాలయం వద్దకు అమీన్‌సాహెబ్‌ పేటకు చెందిన వినియోగదారుడు ఎం.విఘ్నేష్‌ వచ్చి గ్యాస్‌ సిలిండర్‌ కావాలని అడిగాడు. గ్యాస్‌ బుకింగ్‌ జరిగితే గానీ గ్యాస్‌ ఇవ్వలేమని ఏజెన్సీ ప్రతినిధి చెప్పాడు. గ్యాస్‌ బుకింగ్‌ వినియోగదారుడు తీసుకొచ్చిన గ్యాస్‌ పుస్తకాన్ని కార్యాలయంలో పరిశీలించగా ఆ పుస్తకం అప్పటికే ల్యాప్స్‌ అయినట్లు ఏజెన్సీ ప్రతినిధి వినియోగదారునికి చెప్పాడు. దీంతో వినియోగదారుడు సహనం కోల్పోయి ఏజెన్సీ ప్రతినిధిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో గ్యాస్‌ ఏజెన్సీని మూసివేయడంతో మిగతా వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. ఇదే విషయమై స్థానిక పోలీసుల వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.

సబ్‌ డివిజన్‌ పరిధిలో

30 యాక్ట్‌ అమలు

శ్రీకాకుళం క్రైమ్‌ : శ్రీకాకుళం సబ్‌డివిజన్‌ పరిధిలోని శాంతిభద్రతలు దృష్టిలో ఉంచుకుని పోలీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 30 అమల్లోకి తెస్తున్నామని డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద వెల్లడించారు. శుక్రవారం డీఎస్పీ తన కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ ముందస్తు లిఖిత పూర్వక అనుమతి లేకుండా ధర్నాలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసనలు, ప్రజా శాంతికి భంగం కలిగించేలా గుంపులుగా ఉండే కార్యక్రమాలు నిషేధించామని తెలిపారు. ఏ విధమైన సామాజిక, ధార్మిక, రాజకీయ లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తు అనుమతి ఉండాలన్నారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, శాంతిభద్రతల దృష్ట్యా ప్రజలు సహకరించాలని డీఎస్పీ కోరారు.

నాటకాలు.. సామాజిక చైతన్య వీచికలు

కవిటి: సమాజంలో వేళ్లూనుకున్న పెడ ధోరణులు, రుగ్మతల్ని కూకటి వేళ్లతో తొలగించే సామాజిక చైతన్య వీచికలు నాటకాలని వక్తలు అన్నారు. శుక్రవారం మండలంలోని బొరివంకలో కళింగసీమ కళాపీఠం సంస్థ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పరిషత్‌ ఆహ్వానిత పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు విశాఖపట్నం తెలుగు కళాసమితి వారి చిటికెనవేలు, పెందుర్తి నటరాజ డ్రమటిక్‌ అసోసియేషన్‌ వారి నీళ్లు నీళ్లు అనే రెండు నాటిక ప్రదర్శనలు జరిగాయి. వ్యవసాయ కుటుంబంలో తండ్రి అడుగుజాడల్లో నడిచిన ఓ కుటుంబ సంప్రదాయాన్ని తర్వాత తరానికి చెందిన యువకుడు విడిచిపెట్టి ఆధునికత ఉచ్చులో పడి ఉన్న భూమిని పోగొట్టుకున్న వైనమే ఇతివృత్తంగా సాగిన చిటికెన వేలు నాటిక ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆలోచింపజేసింది. రెండో ప్రదర్శనగా వేసిన నీళ్లు నీళ్లు అనే నాటిక ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్న రైతులు వర్షాలు సకాలంలో కురవక సాగులో నష్టపోతున్న వైనం, ఈ నేపథ్యంలో ఉన్న భూమిని అమ్ముకొని బోరుబావి వేసి సాగుచేసి లక్షలు ఆర్జిస్తాననే ఓ రైతు ఆలోచన ఏ విధంగా తారుమారైందనే కథాంశం నేపథ్యంగా సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement