గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల పరిస్థితైతే మరింత దారుణంగా ఉంది. ప్రతీ పని వారికే అప్పగిస్తున్నారు. సహాయకులగా ఎవరూ లేకపోవడంతో చివరికి సబార్డినేట్ ఉద్యోగాలు కూడా వారే చేయాల్సిన దుస్థితి చోటు చేసుకుంది. అటెండర్లు గ్రామస్థాయిలో చేయాల్సిన పనులన్నీ సచివాలయం ఉద్యోగులకు అప్పగించడంతో మదనపడుతున్నారు. గ్రామ స్థాయిలో రకరకాల డేటా, ఇతర సమాచార సేకరణ గత ప్రభుత్వంలో వలంటీర్లు చేయగా, ఇప్పుడా పని అంతా సచివాలయం ఉద్యోగులపైనే పడింది. సర్వేలు, మ్యాపింగ్, తదితర విధులను సచివాలయం ఉద్యోగులే నేరుగా ఇంటింటా తిరిగి చేస్తున్నారు. ఇక, ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిస్థితి కూడా దాదాపు అదే విధంగా ఉంది. రకరకాల బాధ్యతలు అప్పగించడంతో ఒత్తిడికి లోనవుతున్నారు. దాదాపు ప్రతి ప్రభుత్వ శాఖలోనూ ఇదే పరిస్థితి ఉండటంతో, ఒత్తిడికి తట్టుకోలేక అనారోగ్యం పాలవడంతో, కొందరు గుండెపోటుతో మరణిస్తున్నారు.


