Asia Cup 2023 Ind Vs BAN Highlights: భారత్‌కు బంగ్లా షాక్‌

Team India lost by 6 runs against Bangladesh - Sakshi

6 పరుగులతో ఓడిన టీమిండియా

గిల్‌ శతకం వృథా

రేపు భారత్, శ్రీలంక ఫైనల్‌   

కొలంబో: ఆసియా కప్‌లో అనూహ్య ఫలితం... ‘సూపర్‌–4’ దశలో రెండు ఘన విజయాలతో ముందే ఫైనల్‌ స్థానం ఖాయం చేసుకున్న భారత్‌కు చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి ఎదురైంది. ప్రాధాన్యత లేని మ్యాచ్‌లో ముగ్గురు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి బరిలోకి దిగిన టీమిండియా చివరకు ఓటమి పక్షాన నిలిచింది. అయితే ఈ గెలుపు బంగ్లాదేశ్‌ ప్రదర్శనను తక్కువ చేసేది కాదు.

ముందే ఫైనల్‌ రేసు నుంచి నిష్కమించినా చివరి వరకు స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన ఆ జట్టు చెప్పుకోదగ్గ విజయంతో స్వదేశానికి వెళ్లనుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 6 పరుగుల తేడాతో భారత్‌పై గెలిచింది. ఆసియా కప్‌లో గతంలో ఒకే ఒకసారి భారత్‌ను (2012)ఓడించిన బంగ్లాకు ఇది రెండో విజయం. 

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ (85 బంతుల్లో 80; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), తౌహీద్‌ హృదయ్‌ (81 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), నసుమ్‌ అహ్మద్‌ (45 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

49 పరుగులకే జట్టు 4 వికెట్లు కోల్పోగా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షకీబ్, తౌహీద్‌ ఐదో వికెట్‌కు 101 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో శార్దుల్‌ 3, షమీ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్‌ 49.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది.

శుబ్‌మన్‌ గిల్‌ (133 బంతుల్లో 121; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) కెరీర్‌లో ఐదో సెంచరీతో చెలరేగాడు. ప్రతికూల పరిస్థితుల్లో స్పిన్‌కు బాగా అనుకూలిస్తున్న పిచ్‌పై అతను పట్టుదల కనబర్చి నిలబడ్డాడు. అయితే ఇతర బ్యాటర్ల వైఫల్యంతో జట్టుకు ఓటమి తప్పలేదు. చివర్లో అక్షర్‌ పటేల్‌ (34 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా లాభం లేకపోయింది.

ముస్తఫిజుర్‌ 3 వికెట్లు తీయగా... అరంగేట్ర బౌలర్‌ తన్‌జీమ్, మెహదీ హసన్‌ చెరో 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా ఆదివారం జరిగే ఫైనల్లో శ్రీలంకతో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌తో హైదరాబాదీ ఎడంచేతి వాటం బ్యాటర్‌ తిలక్‌ వర్మ వన్డేల్లోకి అడుగు పెట్టాడు. భారత్‌ తరఫున వన్డేలు ఆడిన 252వ ఆటగాడిగా తిలక్‌ నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందే తిలక్‌ 7 టి20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.  

స్కోరు వివరాలు  
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తన్‌జీద్‌ (బి) శార్దుల్‌ 13; లిటన్‌ దాస్‌ (బి) షమీ 0; అనాముల్‌ (సి) రాహుల్‌ (బి) శార్దుల్‌ 4; షకీబ్‌ (బి) శార్దుల్‌ 80; మిరాజ్‌ (సి) రోహిత్‌ (బి) అక్షర్‌ 13; తౌహీద్‌ (సి) తిలక్‌ (బి) షమీ 54; షమీమ్‌ (ఎల్బీ) (బి) జడేజా 1; నసుమ్‌ (బి) ప్రసిధ్‌ 44; మెహదీ హసన్‌ (నాటౌట్‌) 29; తన్‌జీమ్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 265. వికెట్ల పతనం: 1–13, 2–15, 3–28, 4–59, 5–160, 6–161, 7–193, 8–238. బౌలింగ్‌: షమీ 8–1–32–2, శార్దుల్‌ 10–0–65–3, ప్రసిధ్‌ 9–0–43–1, అక్షర్‌ పటేల్‌ 9–0–47–1, తిలక్‌ 4–0–21–0, జడేజా 10–1–53–1.  

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) అనాముల్‌ (బి) తన్‌జీమ్‌ 0; గిల్‌ (సి) తౌహీద్‌ (బి) మెహదీ 121; తిలక్‌ (బి) తన్‌జీమ్‌ 5; కేఎల్‌ రాహుల్‌ (సి) షమీమ్‌ (బి) మెహదీ 19; ఇషాన్‌ కిషన్‌ (ఎల్బీ) (బి) మిరాజ్‌ 5; సూర్యకుమార్‌ (బి) షకీబ్‌ 26; జడేజా (బి) ముస్తఫిజుర్‌ 7; అక్షర్‌ (సి) తన్‌జీద్‌ (బి) ముస్తఫిజుర్‌ 42; శార్దుల్‌ (సి) మిరాజ్‌ (బి) ముస్తఫిజుర్‌ 11; షమీ (రనౌట్‌) 6; ప్రసిధ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్‌) 259. వికెట్ల పతనం: 1–2, 2–17, 3–74, 4–94, 5–139, 6–170, 7–209, 8–249, 9–254, 10–259. బౌలింగ్‌: తన్‌జీమ్‌ 7.5–1–32–2, ముస్తఫిజుర్‌ 8–0–50–3, నసుమ్‌ 10–0–50–0, షకీబ్‌ 10–2–43–1, మెహదీ హసన్‌ 9–1–50–2, మిరాజ్‌ 5–0–29–1.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top