కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో స్నేహిత్‌ | Table Tennis: Suravajjula Snehit Career Best Rank Enters Top 100 | Sakshi
Sakshi News home page

కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో స్నేహిత్‌

Apr 2 2025 3:57 PM | Updated on Apr 2 2025 4:18 PM

Table Tennis: Suravajjula Snehit Career Best Rank Enters Top 100

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సూరావజ్జుల స్నేహిత్‌ అద్భుత పురోగతి సాధించాడు. గతవారం చెన్నైలో జరిగిన వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) స్టార్‌ కంటెండర్‌ లెవెల్‌ టోర్నీలో స్నేహిత్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. 

ఈ ప్రదర్శనతో అతను తన కెరీర్‌లో తొలిసారి టాప్‌–100లోకి వచ్చాడు. మంగళవారం విడుదల చేసిన పురుషుల సింగిల్స్‌ తాజా ర్యాంకింగ్స్‌లో స్నేహిత్‌ ఏకంగా 34 స్థానాలు ఎగబాకి 89వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

నా తదుపరి లక్ష్యం అదే
చెన్నై స్టార్‌ కంటెండర్‌ టోర్నీ రెండో రౌండ్‌లో స్నేహిత్‌ ప్రపంచ 29వ ర్యాంకర్‌ యుకియా ఉడా (జపాన్‌)పై, ప్రిక్వార్టర్‌ ఫైనల్లో భారత దిగ్గజం, ఐదుసార్లు ఒలింపియన్‌ ఆచంట శరత్‌ కమల్‌పై గెలిచి పెను సంచలనం సృష్టించాడు.

‘నా తాజా ప్రపంచ ర్యాంక్‌తో ఎంతో సంతోషంగా ఉన్నా. ఈ ఏడాదిలోపు టాప్‌–100లోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దానిని మూడు నెలల్లోపే అందుకున్నా. ఇక టాప్‌–50లోకి రావడమే నా తదుపరి లక్ష్యం’ అని అంతర్జాతీయస్థాయిలో భారత్‌ తరఫున డజనుకంటే ఎక్కువ పతకాలు సాధించిన స్నేహిత్‌ వ్యాఖ్యానించాడు.

మరోవైపు చెన్నై స్టార్‌ కంటెండర్‌ టోర్నీలో సెమీఫైనల్‌ చేరి కాంస్య పతకాన్ని నెగ్గిన గుజరాత్‌ ప్లేయర్‌ మానవ్‌ ఠక్కర్‌ కూడా కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను సాధించాడు. మానవ్‌ 16 స్థానాలు మెరుగుపర్చుకొని 47వ ర్యాంక్‌లో నిలిచి భారత నంబర్‌వన్‌ అయ్యాడు. భారత్‌కే చెందిన హరీ్మత్‌ దేశాయ్‌ 68వ ర్యాంక్‌లో, మనుష్‌ షా 73వ ర్యాంక్‌లో నిలిచారు. చెన్నై స్టార్‌ కంటెండర్‌ టోరీ్నతో అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన శరత్‌ కమల్‌ 80వ ర్యాంక్‌లో నిలిచాడు.  

ప్రపంచ చెస్‌ ర్యాంకింగ్స్‌: నాలుగో స్థానంలో అర్జున్‌   
అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) తాజా ర్యాంకింగ్స్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, భారత స్టార్‌ ఇరిగేశి అర్జున్‌ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. గత నెలలో అర్జున్‌ ఐదో ర్యాంక్‌లో ఉన్నాడు. ప్రస్తుతం అర్జున్‌ ఖాతాలో 2782 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. మరోవైపు ప్రపంచ చాంపియన్, తమిళనాడు గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ 2787 రేటింగ్‌ పాయింట్లతో మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకొని భారత నంబర్‌వన్‌ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.

తొలి రౌండ్‌లోనే లక్ష్య చహర్‌ ఓటమి 
వరల్డ్‌ బాక్సింగ్‌ కప్‌ టోర్నమెంట్‌ను భారత్‌ పరాజయంతో ప్రారంభించింది. బ్రెజిల్‌లోని ఫాజ్‌ డు లుగాకు నగరంలో ఈ టోర్నీ జరుగుతోంది. పురుషుల 80 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ లక్ష్య చహర్‌కు తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. బ్రెజిల్‌ బాక్సర్, 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత వాండర్లీ పెరీరాతో జరిగిన బౌట్‌లో లక్ష్య చహర్‌ 0–5తో ఓడిపోయాడు.

150 పాయింట్లకుగాను పెరీరాకు 149 పాయింట్లు... లక్ష్య చహర్‌కు 135 పాయింట్లు లభించాయి. వరల్డ్‌ బాక్సింగ్‌ ఆధ్వర్యంలో ఆరు రోజులపాటు జరుగుతున్న ఈ టోర్నీలో భారత్‌ నుంచి పది మంది బాక్సర్లు బరిలో ఉన్నారు.  

రిత్విక్‌ జోడీకి నిరాశ 
సాక్షి, హైదరాబాద్‌: భారత డేవిస్‌ కప్‌ జట్టు సభ్యుడు, హైదరాబాద్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరీకి వరుసగా మూడో టోర్నీలోనూ నిరాశ ఎదురైంది. ఫిబ్రవరిలో సాంటియాగో ఓపెన్‌ ఏటీపీ–250 టోర్నీలో డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన రిత్విక్‌ ఆ తర్వాత పోటీపడ్డ మూడు టోర్నీలలో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. అమెరికాలో జరుగుతున్న హ్యూస్టన్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టోరీ్నలో కొలంబియాకు చెందిన నికోలస్‌ బరియంతోస్‌తో జతకట్టి ఆడిన రిత్విక్‌ తొలి రౌండ్‌లో నిష్క్రమించాడు.

పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో రిత్విక్‌ చౌదరీ–బరియంతోస్‌ ద్వయం 5–7, 4–6తో మార్సెలో జోర్మన్‌–రాఫెల్‌ మటోస్‌ (బ్రెజిల్‌) జోడీ చేతిలో పరాజయం పాలైంది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రిత్విక్‌–బరియంతోస్‌ ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. 

తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్‌ చేశారు. తొలి రౌండ్‌లో ఓడిన రిత్విక్‌–బరియంతోస్‌లకు 3,700 డాలర్ల (రూ. 3 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. 

Advertisement
 
Advertisement
Advertisement