Jasprit Bumrah Replacement: బుమ్రా స్థానంలో షమీ కాదు.. అతడే బెటర్‌.. ఎందుకంటే: టీమిండియా దిగ్గజం

T20 WC 2022 Bumrah Replacement: Sunil Gavaskar Picks Siraj Over Shami To Replace - Sakshi

T20 World Cup 2022- Jasprit Bumrah Replacement: పొట్టి క్రికెట్‌ ప్రపంచ సమరానికి టీమిండియా సన్నద్ధమవుతోంది. పెర్త్‌ వేదికగా ఇప్పటికే ఇందుకు సంబంధించి సన్నాహకాలు ముమ్మరం చేసింది రోహిత్‌ సేన. వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడిన భారత జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ఇక సోమవారం నాటి ఈ మ్యాచ్‌ సందర్భంగా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఆసీస్‌ గడ్డపై తొలి మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించాడు. 35 బంతుల్లోనే 52 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా అక్టోబరు 23న పాకిస్తాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది.

షమీకే అవకాశం?!
అయితే, ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్నునొప్పి కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. కానీ ఇంతవరకు అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న విషయాన్ని బీసీసీఐ వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో, స్టాండ్‌ బై ప్లేయర్‌గా ఎంపికైన సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ వైపే యాజమాన్యం మొగ్గుచూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అతడే బెటర్‌
ఈ క్రమంలో ఇప్పటికే ఫిట్‌నెస్‌ నిరూపించుకున్న అతడు ఆస్ట్రేలియాకు పయనమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, కామెంటేటర్‌ సునిల్‌ గావస్కర్.. బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు ఇతడేనంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు స్టార్‌ స్పోర్ట్స్‌తో ముచ్చటిస్తూ.. ‘‘చాలా కాలంగా షమీ ఆటకు దూరంగా ఉన్నాడు. 

మరోవైపు సిరాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. కాబట్టి బుమ్రా స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడిగా నేను సిరాజ్‌నే ఎంచుకుంటాను. ఇప్పటివరకైతే బీసీసీఐ బుమ్రా రీప్లేస్‌మెంట్‌ ఎవరో ప్రకటించలేదు. షమీ నాణ్యమైన బౌలర్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కానీ.. అతడు గత కొన్ని రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కోవిడ్‌ నెగటివ్‌గా తేలినప్పటికీ ఇప్పుడప్పుడే పూర్తి స్థాయిలో కోలుకున్నాడని చెప్పలేం. టీ20 క్రికెట్‌లో నాలుగు ఓవర్ల కోటానే ఉంటుందని తెలుసు. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో నాకు సిరాజ్‌ బెస్ట్‌ ఆప్షన్‌ అనిపిస్తోంది’’ అని గావస్కర్‌ తన అభిప్రాయాలు వెల్లడించాడు.

అదరగొట్టిన సిరాజ్‌
కాగా సుదీర్ఘ కాలం తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపికైన షమీ కరోనా బారిన పడిన కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. మరోవైపు.. బుమ్రా స్థానంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌తో పునరాగమనం చేసిన సిరాజ్‌ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక అక్టోబరు 16 నుంచి ప్రపంచకప్‌ ఈవెంట్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.  

చదవండి: T20 Tri Series Final: దంచి కొట్టిన ఫిలిప్స్‌.. బంగ్లాదేశ్‌ అవుట్‌! ఫైనల్లో న్యూజిలాండ్‌తో పాటు..
Ind Vs SA: చెలరేగిన వాషీ, సిరాజ్‌, కుల్దీప్‌.. టీమిండియాదే సిరీస్‌! గిల్‌ బ్యాడ్‌లక్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top