T20 Tri Series Final: దంచి కొట్టిన ఫిలిప్స్‌.. బంగ్లాదేశ్‌ అవుట్‌! ఫైనల్లో న్యూజిలాండ్‌తో పాటు..

T20 Tri Series: New Zealand Beat Bangladesh By 48 Runs NZ Vs Pak In Final - Sakshi

New Zealand T20I Tri-Series 2022- New Zealand vs Bangladesh, 5th Match: న్యూజిలాండ్‌- పాకిస్తాన్‌- బంగ్లాదేశ్‌ త్రైపాక్షిక టీ20 సిరీస్‌లో భాగంగా ఆతిథ్య కివీస్‌ వరుసగా మూడో విజయం నమోదు చేసింది. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా బుధవారం (అక్టోబరు 12) జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది. 48 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన సౌథీ బృందం.. ఫైనల్‌లో పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.

టీ20 వరల్డ్‌కప్‌-2022 సన్నాహకాల్లో భాగంగా అక్టోబరు 7న కివీస్‌, పాక్‌, బంగ్లా జట్ల మధ్య ట్రై సిరీస్‌ ఆరంభమైంది. ఇప్పటి వరకు జరిగిన ఐదు మ్యాచ్‌లలో పాకిస్తాన్‌ రెండింట.. ఆతిథ్య న్యూజిలాండ్‌ మూడింట గెలుపొంది ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇక ఈ టూర్‌లో బంగ్లాదేశ్‌ ఇంతవరకు ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. తాజాగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 48 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

దంచికొట్టిన గ్లెన్‌ ఫిలిప్స్‌
క్రైస్ట్‌చర్చ్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది షకీబ్‌ అల్‌ హసన్‌ బృందం. బంగ్లా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు ఫిన్‌ అలెన్‌(32), డెవాన్‌ కాన్వే(64) అదిరిపోయే ఆరంభం అందించారు.

వన్‌డౌన్‌లో వచ్చిన మార్టిన్‌ గప్టిల్‌ సైతం 34 పరుగులతో రాణించగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్‌ ఫిలిప్స్‌ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 24 బంతుల్లో 2 బౌండరీలు, 5 సిక్స్‌లు బాది 60 పరుగులు సాధించాడు.

షకీబ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ వృథా
ఈ మేరకు బ్యాటర్ల విజృంభణతో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్‌ 5 వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు మెరుగైన ఆరంభం లభించినా.. దానిని నిలబెట్టుకోలేకపోయింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షకీబ్‌ అల్‌ హసన్‌ 44 బంతుల్లో 70 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నా.. లోయర్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలైంది.

దీంతో 20 ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగి ఓటమిని మూటగట్టుకుంది బంగ్లాదేశ్‌. కివీస్‌ బౌలర్లలో కెప్టెన్‌ టిమ్‌ సౌథీకి రెండు, ఆడం మిల్నేకు మూడు, మైఖేల్‌ బ్రాస్‌వెల్‌కు రెండు వికెట్లు దక్కాయి.

ఫైనల్లో న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌
ఇక అద్భుత ఇన్నింగ్స్‌తో అదరొట్టిన కివీస్‌ ప్లేయర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌.. గురువారం పాకిస్తాన్‌తో నామమాత్రపు మ్యాచ్‌ ఆడనుంది. మరోవైపు.. కివీస్‌, పాకిస్తాన్‌ శుక్రవారం (అక్టోబరు 14) ఫైనల్లో తలపడనున్నాయి.

చదవండి: T20 World Cup 2022: ఫిట్‌నెస్‌ టెస్టులో క్లియరెన్స్‌.. ఆస్ట్రేలియాకు షమీ
Ind Vs SA: వన్డేల్లో సౌతాఫ్రికా సరికొత్త ‘రికార్డు’.. ధావన్‌ పరిస్థితి ఇదీ అంటూ వసీం జాఫర్‌ ట్రోల్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top