Ind Vs SA: వన్డేల్లో సౌతాఫ్రికా సరికొత్త ‘రికార్డు’.. ధావన్‌ పరిస్థితి ఇదీ అంటూ వసీం జాఫర్‌ ట్రోల్‌!

Ind Vs SA 3rd ODI: South Africa New Record Wasim Jaffer Hilariously Trolls - Sakshi

India vs South Africa, 3rd ODI: ఇప్పటికే టీ20 సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకున్న దక్షిణాఫ్రికా.. నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్‌తో పోరాడుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో మంగళవారం ధావన్‌ సేనతో పోటీ పడుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో ప్రొటిస్‌ జట్టుకు డేవిడ్‌ మిల్లర్‌ కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. ఇక ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా తమ సారథిని మార్చడం ఇది మూడోసారి. 

ముచ్చటగా మూడో కెప్టెన్‌
మొదటి వన్డేకు రెగ్యులర్‌ కెప్టెన్‌ తెంబా బవుమా సారథ్యం వహించగా.. రెండో వన్డేలో కేశవ్‌ మహరాజ్‌ కెప్టెన్సీ చేశాడు. బవుమా అనారోగ్య కారణాల వల్ల మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరం కాగా.. కేశవ్‌ మహరాజ్‌ సైతం విశ్రాంతి కోరుకున్నట్లు సమాచారం. దీంతో మిల్లర్‌ కెప్టెన్‌గా వచ్చాడు.

ఈ నేపథ్యంలో వన్డే ఫార్మాట్‌లో సౌతాఫ్రికా పేరిట సరికొత్త రికార్డు నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో కెప్టెన్‌ రావడం ఇదే మొదటిసారి.

ఇక సౌతాఫ్రికా ఇలా కెప్టెన్లను మార్చడంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘టాస్‌ సమయంలో.. ఒక్కో గేమ్‌లో సౌతాఫ్రికాకు ఒక్కో కెప్టెన్‌ వస్తున్నపుడు శిఖర్‌ ధావన్‌ పరిస్థితి ఇది’’ అంటూ ఓ ఫన్నీ వీడియోను షేర్‌ చేశాడు. 

కుప్పకూలిన టాపార్డర్‌
సిరీస్‌ డిసైడర్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన మిల్లర్‌ బృందానికి ఆరంభంలోనే భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో ప్రొటిస్‌ టాపార్డర్‌ కుప్పకూలింది.

క్లాసెన్‌ 34 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ సిరాజ్‌, షాబాజ్‌ అహ్మద్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్‌ యాదవ్‌ 4 వికెట్లు కూల్చి సౌతాఫ్రికా బ్యాటింగ్‌ ఆర్డరర్‌ పతనాన్ని శాసించాడు. దీంతో 27.1 ఓవర్లలో 99 పరుగులు మాత్రమే చేసి ప్రొటిస్‌ జట్టు ఆలౌట్‌ అయింది.

చదవండి: Central Contract for 2022- 23: జాసన్‌ రాయ్‌కు షాకిచ్చిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు
Women's Asia Cup 2022: డిఫెండింగ్‌ చాంపియన్‌ అవుట్‌! భారత్‌, పాక్‌, శ్రీలంకతో పాటు థాయ్‌లాండ్‌..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top