T20 WC: చెలరేగిన అర్ష్‌దీప్‌, భువీ! పవర్‌ ప్లేలో 29/4! అయినా సరే! ఎట్టకేలకు..

T20 WC Practice Ind Vs WA XI: Surya Arshdeep Shine India Won By 13 Runs - Sakshi

T20 World Cup 2022 India First Practice Match- Ind Vs WA XI: వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ అర్ధ శతకంతో రాణించగా.. పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. దీంతో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌ 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్‌-2022 సన్నాహకాల్లో భాగంగా టీమిండియా పెర్త్‌ వేదికగా ప్రాక్టీసు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సోమవారం వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.

29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా..
లక్ష్య ఛేదనకు దిగిన వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, యజువేంద్ర చహల్‌ చుక్కలు చూపించారు. ఈ క్రమంలో పవర్‌ ప్లే ముగిసే సరికి కేవలం 29 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది.

కష్టాల్లో కూరుకుపోయిన జట్టును సామ్‌ ఫానింగ్‌ ఆదుకున్నాడు. 59 పరుగులు సాధించి టీమిండియాకు సవాల్‌ విసిరాడు. అయితే, మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో 145 పరుగులకు వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా కథ ముగిసింది.

వారెవ్వా.. అర్ష్‌దీప్‌ సింగ్‌
భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌కు మూడు(3/6), చహల్‌కు రెండు(2/15), భువనేశ్వర్‌ కుమార్‌కు రెండు(2/26) వికెట్లు, హర్షల్‌ పటేల్‌కు ఒక వికెట్‌ దక్కాయి. 3 ఓవర్లు బౌలింగ్‌ చేసి కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చిన అర్ష్‌.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడంటూ ఫ్యాన్స్‌ అభినందిస్తున్నారు. మరోవైపు భువీ సైతం ఫామ్‌లోకి వచ్చాడని.. అసలైన పోరులో మరింత మెరుగ్గా రాణించాలని ఆకాంక్షిస్తున్నారు. 

వాళ్లిద్దరూ తుస్సుమన్నారు.. అయినా
ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ(3)కు జోడీగా రిషభ్‌ పంత్‌(9) ఓపెనర్‌గా వచ్చాడు. వీరిద్దరు పూర్తిగా నిరాశపరచగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ దీపక్‌ హుడా 14 బంతుల్లో 22 పరుగులు చేశాడు. సూర్య నాలుగో స్థానంలో వచ్చి 35 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు.

హార్దిక్‌పాండ్యా 27, దినేశ్‌కార్తిక్‌ 19(నాటౌట్‌), అక్షర్‌ పటేల్‌ 10, హర్షల్‌ పటేల్‌ 5 పరుగులు చేశారు. కాగా అక్టోబరు 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో టీమిండియా ఐసీసీ ఈవెంట్‌ ప్రయాణాన్ని ఆరంభించనుంది.

టీమిండియా వర్సెస్‌ వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్
భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్‌), రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చహల్.

వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌: 
డీ ఆర్సీ షార్ట్, ఆరోన్ హార్డీ, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్(వికెట్‌ కీపర్‌), అష్టన్ టర్నర్(కెప్టెన్‌), సామ్ ఫానింగ్, హమీష్ మెకెంజీ, జై రిచర్డ్‌సన్, ఆండ్రూ టై, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, మాథ్యూ కెల్లీ, నిక్ హాబ్సన్.

చదవండి: Ind Vs SA: టీమిండియా అరుదైన ప్రపంచ రికార్డు.. ఇతర జట్లకు అందనంత దూరంలో! ఇక అయ్యర్‌..
టీమిండియా బౌలర్ల విజృంభణ.. 37 పరుగులకే కుప్పకూలిన ప్రత్యర్ధి
T20 WC 2022 Final: ఈసారి ఫైనల్లో వెస్టిండీస్‌తో పోటీపడేది ఆ జట్టే! ఇంకా..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top