Ind Vs SA: టీమిండియా అరుదైన ప్రపంచ రికార్డు.. ఇతర జట్లకు అందనంత దూరంలో! ఇక అయ్యర్‌..

Ind Vs SA 2nd ODI: India World Record In Chasing Wins Shreyas Iyer POTM - Sakshi

India vs South Africa, 2nd ODI- Records: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఛేజింగ్‌లో అత్యధికసార్లు గెలుపొందిన మొదటి జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించింది. కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాంచీ వేదికగా సాగిన రెండో మ్యాచ్‌లో ధావన్‌ సేన ఆదివారం(అక్టోబరు9) సౌతాఫ్రికాతో తలపడింది.

లక్ష్య ఛేదనలో భారత్‌కు సాటిలేదు!
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పర్యాటక జట్టు ప్రొటిస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది కేశవ్‌ మహరాజ్‌ బృందం. లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు గొప్ప ఆరంభం లభించలేదు. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌(13), మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ (28) స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయారు.

ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్‌ కిషన్‌(93), నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్‌ అయ్యర్‌(113, నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయం దిశగా నడిపారు. సంజూ శాంసన్‌ సైతం 30 పరుగులతో రాణించడంతో 45.5 ఓవర్లలోనే భారత్‌ టార్గెట్‌ను ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.

టీమిండియా తర్వాత..
కాగా వన్డేల్లో లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఇది 300వ విజయం కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఛేజింగ్‌లో ఇప్పటి వరకు అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా భారత్‌ నిలిచింది. లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌, కూల్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని, ఛేజింగ్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లి తదితరులు టీమిండియాను లక్ష్య ఛేదనలో మేటి జట్టుగా నిలపడంలో కీలక పాత్ర పోషించారనడంలో సందేహం లేదు. 

ఈ జాబితాలో టీమిండియా తర్వాత 257 విజయాలతో ఆస్ట్రేలియా, 247 విజయాలతో వెస్టిండీస్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

భళా శ్రేయస్‌ అయ్యర్‌.. సూర్య కూడా లైన్‌లో!
ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా.. శ్రేయస్‌ అయ్యర్‌ టీమిండియా తరఫున ఈ ఏడాది అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు గెలిచిన ఆటగాడిగా నిలిచాడు. రాంచీ మ్యాచ్‌లో అతడు 111 బంతులు ఎదుర్కొని 15 ఫోర్ల సాయంతో 113 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి భారత్‌ను గెలిపించాడు.

ఈ నేపథ్యంలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఈ ఏడాది అయ్యర్‌కు ఇది ఐదో(వన్డేల్లో మూడు, టీ20లలో రెండు) అవార్డు. ఇక ఇప్పటి వరకు 4 ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన సూర్యకుమార్‌ యాదవ్‌.. శ్రేయస్‌ అయ్యర్‌కు గట్టిపోటీనిస్తున్నాడు.

చదవండి: Ishan Kishan: పాపం ఇషాన్‌ కిషన్‌! ఇది నా హోం గ్రౌండ్‌.. వాళ్లు సెంచరీ చేయమన్నారు! కానీ..
T20 World Cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌.. నెట్స్‌లో భారీ షాట్లతో విరుచుకుపడ్డ కోహ్లి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top