రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌కు ముంబై ప్రకటించిన జట్టులో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. రెడ్ బాల్ క్రికెట్‌లో ఆడేందుకు సూర్యకుమార్ సిద్దంగా ఉన్నప్పటికి సెలక్టర్లు మాత్రం పరిగణలోకి తీసుకోలేదు.
అతడు దాదాపు ఏడాది నుంచి రెడ్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉండడమే ఎందుకు కారణం. అంతేకాకుండా ముంబై ప్రీ-సీజన్ ప్రాక్టీస్ క్యాంప్‌లో కూడా అతడు పాల్గోనకపోవడంతో తొలి మ్యాచ్‌కు సూర్యను ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో సూర్య ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మాజీ కెప్టెన్ ముంబై క్లబ్ క్రికెట్‌లో ఆడనున్నట్లు తెలుస్తోంది.
ప్రెసిడెంట్ కప్‌లో..
ముంబై తరపున 'ప్రెసిడెంట్ కప్'లో సూర్యకుమార్ ఆడనున్నట్లు సమాచారం. ఈ టోర్నీలో ఆడి తన బ్యాటింగ్ రిథమ్‌ను తిరిగి పొందాలని సూర్య భావిస్తున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జర్నలిస్ట్ ఒకరు ఎక్స్ వేదికగా వెల్లడించారు. అతడు ఇక్కడ మెరుగైన ప్రదర్శన చేస్తే రంజీ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అతడు ఎంపికయ్యే అవకాశముంది.
ఇక సూర్య చివరగా గతేడాది ఫిబ్రవరిలో విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ సెమీఫైనల్‌లో ముంబై తరఫున ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 86 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 42.34 సగటుతో 5,758 పరుగులు సాధించాడు. ఇందులో 14 సెంచరీలు, 30 అర్ధశతకాలు ఉండగా, అత్యధిక స్కోరు 200 పరుగులగా ఉంది. కాగా టీ20 ప్రపంచకప్-2026 విజయం తర్వాత భారత జట్టుకు సూర్యకుమార్ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
చదవండి: జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్


