సుశీల్‌ మళ్లీ జైలుకు... | Supreme Court cancels wrestler Sushil Kumars bail | Sakshi
Sakshi News home page

సుశీల్‌ మళ్లీ జైలుకు...

Aug 14 2025 3:54 AM | Updated on Aug 14 2025 3:54 AM

Supreme Court cancels wrestler Sushil Kumars bail

రెజ్లర్‌ బెయిల్‌ రద్దు చేసిన సుప్రీంకోర్టు 

వెంటనే లొంగిపోవాలని ఆదేశం

న్యూఢిల్లీ: భారత ప్రముఖ రెజ్లర్, డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌ సుశీల్‌ కుమార్‌పై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. హత్య కేసులో నిందితుడైన సుశీల్‌కు ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చి న బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాలతో కూడిన బెంచ్‌ ఈ తీర్పునిచ్చి ంది. వారం రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని ఆదేశించడంతో సుశీల్‌ మళ్లీ జైలుపాలు కానున్నాడు. 

యువ రెజ్లర్‌ సాగర్‌ ధన్‌కర్‌ హత్య కేసులో జైల్లో ఉన్న సుశీల్‌కు ఐదు నెలల క్రితం బెయిల్‌ లభించగా... దీనిని వ్యతిరేకిస్తూ సాగర్‌ తండ్రి అశోక్‌ ధన్‌కర్‌ కోర్టుకెక్కడంతో సుప్రీంకోర్టు స్పందించింది. ఆటగాడిగా సుశీల్‌ స్థాయి, ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన అతను ఘనతలను కూడా ప్రత్యేకంగా ఉదహరిస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  

పరారీ తర్వాత లొంగిపోయి... 
కేసు వివరాల్లోకెళితే... 2021 మే నెలలో సుశీల్‌ కుమార్‌తో పాటు పలువురు రెజ్లర్లు సాధన చేసే ఛత్రశాల్‌ స్టేడియం ముందు ఈ ఘటన జరిగింది. ఒక ఆస్తి వివాదానికి సంబంధించిన వ్యవహారంలో సుశీల్‌ తదితరులు కలిసి సాగర్‌ ధన్‌కర్, అతని మిత్రులపై తీవ్ర దాడికి పాల్పడ్డారు. గాయాలతో ఆ తర్వాత సాగర్‌ మృతి చెందాడు. దాంతో సుశీల్‌పై కేసు నమోదైంది. 

దాదాపు ఇరవై రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత చివరకు సుశీల్‌ పోలీసుల ముందు లొంగిపోయాడు. దీనిపై ట్రయల్‌ కోర్టు విచారణ సందర్భంగా హత్యతో పాటు అక్రమంగా ఆయుధాలను కలిగి ఉండటం తదితర అంశాలతో పోలీసులు ఛార్జ్‌ïÙట్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో సుశీల్‌ను తీహార్‌ జైలుకు పంపించారు. అయితే ఈ నాలుగేళ్ల కాలంలో వేర్వేరు కారణాలతో అతను ఐదుసార్లు స్వల్పకాలిక బెయిల్‌ పొందాడు.  

హైకోర్టు తప్పు చేసింది... 
సుశీల్‌కు గత మార్చిలో ఢిల్లీ కోర్టుపై బెయిల్‌ మంజూరు చేయడం తనకు తీవ్ర వేదన కలిగించిందని, తనకు న్యాయం చేయాలంటూ  ఢిల్లీ పోలీసు విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సాగర్‌ తండ్రి అశోక్‌ ధన్‌కర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. సుశీల్‌కు బెయిల్‌ ఇచ్చిన ప్రతీసారి అతను సాక్షులను ప్రభావితం చేశాడని... 35 మంది సాక్షుల్లో 28 మంది ఇప్పుడు గతంలో తాము ఇచ్చిన సాక్ష్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పిటిషనర్‌ ఆరోపించారు. 

అనంతరం కేసుపై కోర్టు తమ అభిప్రాయాలు వెల్లడించింది. ‘నిందితుడు అగ్రశ్రేణి రెజ్లర్‌. ప్రపంచ స్థాయిలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. కాబట్టి సమాజంలో కూడా వ్యక్తిగతంగా కూడా ఎంతో గుర్తింపు ఉన్న వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అతను సాక్షులను, విచారణను ప్రభావితం చేయవచ్చు. ఎఫ్‌ఐఆర్‌ తర్వాత కూడా అతను పరారీలో ఉన్న విషయంలో మర్చిపోవద్దు. అతనిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

కేసు తీవ్రత తగ్గించే విధంగా బెయిల్‌ ఉండరాదు. సత్ప్రవర్తనలాంటి అంశాలను ఇలాంటి కేసుల్లో పరిగణలోకి తీసుకోవద్దు. ఈ కేసులో బెయిల్‌ ఇచ్చి న ఢిల్లీ హైకోర్టు తప్పుగా వ్యవహరించింది’ అని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. అయితే బెయిల్‌ ఇచ్చిన కారణాలను తప్పుగా చూపిస్తూ దీనిని రద్దు చేసిన సుప్రీంకోర్టు... మున్ముందు సుశీల్‌ కుమార్‌కు కొత్తగా మళ్లీ బెయిల్‌కు అప్పీల్‌ చేసుకునే అవకాశం మాత్రం ఇచ్చి ంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement