ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మరోసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ఫ్రాంచైజీ అయిన వాషింగ్టన్ ఫ్రీడం 2026 సీజన్ కోసం స్టీవ్‌ను కెప్టెన్‌గా నియమించింది. స్టీవ్ గతంలోనూ ఈ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2024 సీజన్‌లో వ్యక్తిగతంగానూ సత్తా చాటి టైటిల్ గెలిపించాడు.
గత సీజన్‌లో ఆస్ట్రేలియాకే చెందిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ వాషింగ్టన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా, ఈసారి ఆ బాధ్యతలు స్మిత్‌కు అప్పగించారు. వాషింగ్టన్ బృందం ఆస్ట్రేలియా ప్రస్తుత, మాజీ ఆటగాళ్లతో నిండిపోయి ఉంది. ఈ జట్టుకు రికీ పాంటింగ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
టోర్నీ విషయానికొస్తే.. 2026 సీజన్ జూన్ 18న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో టెక్సాస్ కింగ్స్, సీయాటిల్ ఓర్కాస్ తలపడనున్నాయి. వాషింగ్టన్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 20న సియాటిల్‌తో ఆడనుంది.
కాగా, ఈ టోర్నీ 2023లో ప్రారంభం కాగా.. ఎంఐ న్యూయార్క్ రెండు సార్లు, వాషింగ్టన్ ఓసారి టైటిల్ సాధించాయి. గత ఎడిషన్‌లో ఎంఐ న్యూయార్క్ విజేతగా నిలువగా.. వాషింగ్టన్ ఫ్రీడం రన్నరప్‌గా నిలిచింది.


