
స్టీన్‌బెర్గన్‌కు పసిడి
ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్
సింగపూర్: ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ ఆరో రోజు స్టార్ స్విమ్మర్లు లాన్ మర్చెండ్ (ఫ్రాన్స్), టీనేజ్ స్టార్ స్విమ్మర్ సమ్మర్ మెకింటోష్ (కెనడా) బరిలో లేకపోవడంతో... ఐదు వేర్వేరు దేశాలకు చెందిన స్విమ్మర్లు పసిడి పతకాలు ఖాతాలో వేసుకున్నారు. శుక్రవారం పోటీల్లో నెదర్లాండ్స్, చైనా, హంగేరి, అమెరికా, ఇంగ్లండ్‌కు చెందిన స్విమ్మర్లు స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో మ్యారిట్ స్టీన్‌బెర్గన్ (నెదర్లాండ్స్) పసిడి పతకంతో మెరిసింది. ఫైనల్ రేసులో స్టీన్‌బెర్గన్ 52.55 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది.
మొల్లీ ఓ కల్లాఘన్ (52.67 సెకన్లు; ఆ్రస్టేలియా), టారీ హుస్కే (52.89 సెకన్లు; అమెరికా) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. 2024లో దోహా వేదికగా జరిగిన పోటీల్లో సైతం విజేతగా నిలిచిన స్టీన్‌బెర్గన్... చివరి 50 మీటర్లలో జోరు పెంచి చాంపియన్‌గా అవతరించింది. ఆ్రస్టేలియా, అమెరికా స్విమ్మర్ల నుంచి కఠిన పోటీ ఎదురైనా... ఆఖర్లో ఆధిక్యం కనబర్చింది.
‘దోహాలో సునాయాసంగా విజయం సాధించా. కానీ ఈ సారి పోటీ చాలా తీవ్రంగా ఉంది. అందుకే ఈ విజయం చాలా సంతృప్తినిచి్చంది’ అని పోటీ అనంతరం స్టీన్‌బెర్గన్ పేర్కొంది. ఆరో రోజు పోటీలు ముగిసేసరికి అమెరికా, ఆ్రస్టేలియా ఐదేసి స్వర్ణ పతకాలతో పట్టిక అగ్రస్థానంలో నిలిచాయి. ఓవరాల్‌గా అమెరికా 20 పతకాలు సాధించగా... ఆ్రస్టేలియా 13 పతకాలు ఖాతాలో వేసుకుంది.
కిన్ విన్
పురుషుల 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో చైనా స్విమ్మర్ కిన్ హైయాంగ్ విజేతగా నిలిచాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో కిన్ 2 నిమిషాల 7.41 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పీ వటనబె (2 నిమిషాల 7.70 సెకన్లు; జపాన్) రజతం గెలుచుకోగా... కాస్పర్ కారŠూబ్య (2 నిమిషాల 7.73 సెకన్లు; నెదర్లాండ్స్) కాంస్య పతకం నెగ్గాడు. ఈ విభాగంలో రెండేళ్ల క్రితం ప్రపంచ రికార్డు (2 నిమిషాల 5.48 సెకన్లు) తనపేరిట రాసుకున్న కిన్... విజయం అనంతరం ‘ఇదో అద్భుతం’ అని వ్యాఖ్యానించాడు.
100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లోనూ పసిడి నెగ్గిన కిన్... 200 మీటర్లలోనూ జోరు కనబర్చి డబుల్ ధమాకా మోగించాడు. పురుషుల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ హబర్ట్ (హంగేరి) పసిడి పతకం గెలిచాడు. 1 నిమిషం 53.19 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. పీటర్ కోట్జీ (1 నిమిషం 53.36 సెకన్లు; దక్షిణాఫ్రికా), యోహాన్ బ్రౌర్డ్ (1 నిమిషం 54.62 సెకన్లు; ఫ్రాన్స్) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. స్టార్ స్విమ్మర్ కేట్ డగ్లస్... అమెరికాకు ఐదో స్వర్ణం అందించింది. మహిళల 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో 2 నిమిషాల 18.50 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది.
ఈ విభాగంలో ఇది రెండో అత్యుత్తమ టైమింగ్ కావడం విశేషం. చికునోవా (2 నిమిషాల 19.96 సెకన్లు) రజతం గెలుచుకోగా.. కైలెన్ కార్బెట్, అలీనా ముసుకా (2 నిమిషాల 23.52 సెకన్లు) ఒకే సమయంలో లక్ష్యాన్ని చేరి కాంస్యం దక్కించుకున్నారు. పురుషుల 4–200 ఫ్రీస్టయిల్ రిలేలో బ్రిటన్ జట్టు 6 నిమిషాల 59.84 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం పసిడి గెలుచుకుంది. చైనా (7 నిమిషాల 0.91 సెకన్లు), ఆ్రస్టేలియా (7 నిమిషాల 0.98 సెకన్లు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నాయి.
చైనాకు చెందిన 12 ఏళ్ల స్విమ్మర్ యూ జిడి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో సత్తాచాటింది. మహిళల 4–200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే విభాగంలో చైనా జట్టులో సభ్యురాలైన యూ జిడి కాంస్యం గెలుచుకుంది. ఆ్రస్టేలియా, అమెరికా బృందాలు వరుసగా స్వర్ణ, రజతాలు నెగ్గారు. 200 మీటర్ల బటర్‌ఫ్లై, 200 మీటర్ల మెడ్లీ వ్యక్తిగత విభాగాల్లోనూ యూ జిడి పతకానికి దగ్గరగా వచ్చింది.
నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకానికి దూరమైంది. 400 మీటర్ల విభాగం యూ జిడి ఇంకా పోటీ పడాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత స్విమ్మర్ల నిరాశజనక ప్రదర్శన ఆరో రోజు కూడా కొనసాగింది. పురుషుల 100 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో రోహిత్ 47వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.