
ఈ నెలాఖరులో జింబాబ్వేతో జరుగబోయే రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 16 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (ఆగస్ట్ 21) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్ చరిత్ అసలంక కాగా.. పథుమ్ నిస్సంక, కుసాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, నిషాన్ మధుష్క, దుష్మంత చమీరా, దిల్షన్ మధుషంక, అసిత ఫెర్నాండో, మహీశ్ తీక్షణ, దునిత్ వెల్లలగే, జెఫ్రీ వాండర్సే సభ్యులుగా కొనసాగారు.
చివరిగా బంగ్లాదేశ్‌తో ఆడిన వన్డే సిరీస్‌లో సభ్యులుగా ఉన్న అవిష్క ఫెర్నాండో, ఎషాన్ మలింగకు ఈ జట్టులో చోటు దక్కలేదు. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా గాయపడిన స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ ఈ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. టాపార్డర్ బ్యాటర్ నువనిదు ఫెర్నాండో ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు.
నువనిదు చివరిగా గతేడాది న్యూజిలాండ్‌తో వన్డేలో ఆడాడు. ఈ జట్టులో 22 ఏళ్ల అన్‌క్యాప్డ్ ప్లేయర్ పవన్ రత్నాయకేకు కూడా చోటు దక్కింది. దేశవాలీ క్రికెట్‌లో సత్తా చాటడంతో రత్నాయకే తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.
కాగా, శ్రీలంక జట్టు రెండు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆగస్ట్ 29 నుంచి జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత వన్డేలు జరుగనున్నాయి. ఆగస్ట్ 29, 31 తేదీల్లో హరారే వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో ఇదే హరారే వేదికగా టీ20లు కూడా జరుగనున్నాయి. టీ20 సిరీస్ కోసం లంక జట్టును త్వరలోనే ప్రకటిస్తారు.
జింబాబ్వేతో వన్డే సిరీస్ కోసం శ్రీలంక జట్టు: చరిత్ అసలంక (సి), పథుమ్ నిస్సంక, నిషాన్ మధుష్క, కుసాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, నువనిదు ఫెర్నాండో, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, పవన్ రత్నాయకే, దునిత్ వెల్లలగే, మిలన్ రత్నాయకే, మహీశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, ఆసిత ఫెర్నాండో, దుష్మంత చమీరా, దిల్షన్ మధుశంక