దండకారణ్యం నుంచి వెళ్లే క్రమంలో ఎన్‌కౌంటర్‌లో హతం
కాకినాడ పోర్టు ద్వారాతప్పించుకోవాలన్నది వ్యూహం
కొరియర్ అరెస్టుతో పోలీసులకు పక్కా సమాచారం
ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గడ్ ట్రై జంక్షన్‌లో కూంబింగ్ ముమ్మరం
మారేడుమిల్లిలో మాటేసి ముగించిన భద్రతా బలగాలు
సాక్షి, అమరావతి: మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా కథ లంకకు చేరకుండానే అర్ధంతరంగా ముగిసింది. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు చుట్టుముట్టి వందలాది మంది మావోయిస్టులను హతమారుస్తుండటంతో దండకారణ్యం ఇక తనకు ఏమాత్రం సురక్షిత స్థానం కాదని స్పష్టం కావడంతో.. అత్యంత విశ్వసనీయమైన అనుచరులతో కలసి హిడ్మా శ్రీలంకకు వెళ్లి కొంత కాలం తల దాచుకోవాలని భావించారు.
కానీ ఓ కొరియర్ అరెస్టుతో హిడ్మా ప్రణాళిక బెడిసి కొట్టింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. మోస్టు వాంటెడ్ మావోయిస్టు మాడ్వీ హిడ్మా కోసం కేంద్ర బలగాలతోపాటు ఛత్తీస్‌గడ్, ఒడిశా, మహారాష్ట్ర బలగాలు రెండేళ్లుగా విస్తృతంగా గాలిస్తున్నాయి. మరోవైపు ఏపీ, తెలంగాణ పోలీసు బలగాలు కూడా మాటేసి ఉన్నాయి.
ప్రధానంగా దశాబ్దం క్రితం మావోయిస్టు పార్టీ ‘జనతన సర్కారు’ (ప్రజా ప్రభుత్వం) పేరుతో సమాంతర ప్రభుత్వం నడిపిన ఛత్తీస్‌గఢ్‌లోని అభూజ్‌మఢ్‌ను కేంద్ర బలగాలు పూర్తిగా వాటి ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆ క్రమంలో గత రెండేళ్లలో దాదాపు 400 మందికి పైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు. అయినా హిడ్మా మాత్రం పోలీసు బలగాలకు కొరకరాని కొయ్యగా మారాడు. అతని కోసం కొన్ని వందలసార్లు చేసిన గాలింపు చర్యలు ఫలించలేదు.
దండకారణ్యం.. అందులోనూ ఛత్తీస్‌గఢ్–మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ – ఒడిశా సరిహద్దు ప్రాంతాలు హిడ్మాకు కొట్టినపిండి. దాంతో ఆయన దొరికినట్టే దొరికి చాలాసార్లు తృటిలో తప్పించుకున్నాడు. హిడ్మానే ఏకైక లక్ష్యంగా పోలీసు బలగాలు దండకారణ్యం ప్రాంతాన్ని అణువణువూ జల్లెడ పడుతున్నాయి. ఆయనకు ఆశ్రయం ఇచ్చేందుకు అవకాశం ఉన్న గిరిజన గూడేల్లో పోలీసు బలగాలు ప్రత్యేకంగా పికెట్లు ఏర్పాటు చేశాయి.
గిరిజనులతో హిడ్మాకు ఉన్న సంబంధాలను కట్ చేశాయి. ఈ నేపథ్యంలో హిడ్మా తల దాచుకునేందుకు అవకాశం ఉందని భావిస్తున్న రెండు మూడు ప్రాంతాలను కూడా పోలీసు బలగాలు ఇటీవల గుర్తించాయి. దాంతో ఇక దండకారణ్యం తనకు ఏమాత్రం సురక్షిత స్థానం కాదని హిడ్మా భావించాడు.
కాకినాడ మీదుగా శ్రీలంక వెళ్లాలని ప్లాన్
దండకారణ్యం దాటి శ్రీలంక వెళ్లాలని హిడ్మా భావించాడు. ఆయనతోపాటు మిగిలి ఉన్న కొద్ది మంది అగ్ర నేతలకు శ్రీలంకే తమకు సురక్షిత ప్రదేశమని మావోయిస్టు పార్టీ కూడా భావించింది. అందుకే అగ్ర నేతలను గుట్టుచప్పుడు కాకుండా శ్రీలంక చేర్చాలని వ్యూహ రచన చేశాడు. ఈ నేపథ్యంలోనే దండకారణ్యం వీడి.. ఏపీ, ఛత్తస్‌గఢ్, ఒడిశా ఉమ్మడి సరిహద్దు ప్రాంతం ట్రై జంక్షన్ గుండా బయటకు రావాలని హిడ్మా నిర్ణయించాడు.
తన భార్య మడకం రాజేతోపాటు అత్యంత విశ్వసనీయమైన నలుగురు అంగరక్షకులతో ఆయన దండకారణ్యం వీడి ట్రై జంక్షన్‌లోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి రంపచోడవరం, రాజమహేంద్రవరం మీదుగా కాకినాడ చేరాలన్నది ప్రణాళిక. కొన్ని రోజుల క్రితమే కొందరు మావోయిస్టులు కాకినాడ చేరుకున్నారు. హిడ్మా, ఆయన బృందాన్ని కాకినాడ పోర్టు నుంచి సముద్ర మార్గం గుండా శ్రీలంకకు పంపే ఏర్పాట్ల కోసమే వారు ముందుగా చేరుకున్నారు.
కొరియర్ ఇచ్చిన సమాచారంతోనే..
మావోయిస్టు అగ్రనేతలకు కొరియర్లుగా భావిస్తున్న కొందరు దండకారణ్యం దాటి బయటకు వచ్చినట్టు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. దాంతో పక్కా వ్యూహంతో ఓ కొరియర్‌ను అదుపులోకి తీసుకున్నాయని తెలుస్తోంది. హిడ్మా సొంత జిల్లా ఛత్తీస్‌గడ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన ఆ కొరియర్‌ను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా మొత్తం విషయం తెలిసింది. దాంతో కేంద్ర నిఘా వర్గాలు ఏపీ, ఒడిశా పోలీసులకు సమాచారం ఇచ్చాయి.
ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని ట్రై జంక్షన్‌లో కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే మారేడుమిల్లి అడవుల్లో హిడ్మా బృందం పోలీసు బలగాలకు ఎదురుపడగా ఎదురు కాల్పులు సంభవించాయి. ఆ ఎన్‌కౌంటర్లో హిడ్మాతోపాటు ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. కాగా ఇందుకు కొంత భిన్నంగా మరో సమాచారం కూడా వినిపిస్తోంది.
కొరియర్ ఇచ్చిన సమాచారంతో హిడ్మా, అతడి బృందాన్ని పోలీసులు ఏపీలో సోమవారం అదుపులోకి తీసుకున్నాయని.. అనంతరం మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్‌లో మరణించినట్టు ప్రకటించాయని చెబుతున్నారు. ఆ రెండింటిలో ఏది వాస్తవం అన్నది కచ్చితంగా నిర్ధారించలేకపోయినా.. శ్రీలంకకు వెళ్లిపోయే క్రమంలోనే హిడ్మా పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించినట్టు స్పష్టమవుతోంది.


