హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పుట్టపర్తికి చేరుకున్న సీఎం చంద్రబాబు
సీఐఐ సమ్మిట్ తర్వాత హైదరాబాద్‌లోనే చంద్రబాబు మకాం
అక్కడి నుంచి మంగళవారం ప్రత్యేక హెలీకాప్టర్‌లో తనయుడు లోకేశ్‌తో కలిసి పుట్టపర్తికి..
డిప్యూటీ సీఎం కూడా బెంగళూరు నుంచి పుట్టపర్తికి..
వారాంతంలో హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్న బాబు, లోకేశ్, పవన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజులు హైదరాబాద్‌లో ఉండి మంగళవారం రాష్ట్రానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి మంగళవారం సాయంత్రం ఆయన ప్రత్యేక హెలీకాప్టర్‌లో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వెళ్లారు. గత శనివారం ఆయన విశాఖలో సీఐఐ సమిట్ ముగిసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లారు. తన నివాసంలో మంగళవారం వరకూ బసచేశారు. 3 రోజుల తర్వాత మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో తన తనయుడు, మంత్రి లోకేశ్‌తో కలిసి పుట్టపర్తి చేరుకున్నారు.
ఇద్దరూ రాత్రి పుట్టపర్తిలో బసచేశారు. ప్రధాని మోదీతో కలిసి బుధవారం ఉదయం శ్రీసత్యసాయి శత జయంతి సందర్భంగా నిర్వహించే మహిళా దినోత్సవంలో పాల్గొంటారు. మరోవైపు.. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ బెంగళూరు నుంచి మంగళవారం రాత్రి కారులో బయల్దేరి నేరుగా పుట్టపర్తికి చేరుకుంటారు. అలాగే గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా మంగళవారమే పుట్టపర్తికి రావాల్సి ఉండగా.. ఆయన కార్యక్రమం వాయిదా పడింది. 
ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎంతో కలిసి హైదరాబాద్ నుంచి పుట్టపర్తి చేరుకున్న మంత్రి లోకేశ్
వీకెండ్స్ హైదరాబాద్‌లోనే..
ఇదిలా ఉంటే.. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు.. మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ గత వారాంతం కూడా హైదరాబాద్‌లోనే గడిపారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ముగ్గురి హైదరాబాద్ పర్యటనల సంఖ్యలు 80, 83, 104కు చేరాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు, 2019లో అధికారం కోల్పోయాక కూడా చంద్రబాబు ఇలాగే వ్యవహరించారు. రాష్ట్ర ప్రజలు కరోనా కష్టాల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు 2022 వరకు హైదరాబాద్‌లో తలదాచుకున్నారనే విమర్శలున్నాయి.


