బాలల సంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి..
చేతన నాట్యమంచ్ ద్వారా విప్లవ బాటలోకి..
2009లోనే సుక్మా జిల్లాలో జేగురుగొండ ఏరియా దళ కమాండర్‌గా బాధ్యతలు.. చింతల్నార్, ఝిరామ్‌ఘాటీ, తెర్రం దాడుల్లో పాత్ర
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏపీలోని మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్ జరిగినట్లు మంగళవారం ఉదయం 8 గంటలకు బయటకు తెలిసింది. 9 గంటలకల్లా ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత చనిపోయినట్టుగా ప్రచారం మొదలైంది. ఆ తర్వాత గంటకే చనిపోయింది హిడ్మా అంటూ ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. అయితే, చనిపోయింది భీకర దాడులతో భద్రతా దళాలను ముప్పు తిప్పలు పెట్టిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మడ్వి హిడ్మానా? మరొకరా? అనే చర్చ మొదలైంది.
ఓ వైపు మీడియాలో హిడ్మా మరణంపై కథనాలు వస్తున్నా, గెరిల్లా వార్‌ఫేర్‌లో ఆరితేరిన హిడ్మా చనిపోయే అవకాశమే లేదని మావోయిస్టుల సానుభూతిపరులు అభిప్రాయపడుతూ వచ్చారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్ పోలీసు వర్గాల నుంచీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది హిడ్మానే అంటూ ఏపీ ఇంటెలిజెన్స్ డిప్యూటీ చీఫ్ మహేశ్‌చంద్ర లడ్డా అధికారికంగా ప్రకటించారు. దీంతో విప్లవ శ్రేణులు విస్తుపోగా.. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ కోసం ఏళ్ల తరబడి దండకారణ్యంలో అడవులను జల్లెడ పడుతున్న భద్రతా దళాలు సంబరాలు చేసుకున్నాయి.
భద్రన్న, చలపతి అడుగుజాడల్లో..
ఆదివాసీల్లో మురియా తెగకు చెందిన మడ్వి హిడ్మా సొంతూరు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామం. బాలల సంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన హిడ్మా ఆ తర్వాత చేతన నాట్య మంచ్ ద్వారా విప్లవ బాటలో నడిచారు. కిషన్ జీ అలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయుధపోరులో తొలి పాఠాలు నేర్చుకుంటే, మరో అగ్రనేత చలపతి హిడ్మాను మరింత సాన పట్టారు.
ఈ నేపథ్యంలో తొలిసారిగా 2009లో పార్టీ హిడ్మాకు సుక్మా జిల్లాలోని జేగురుగొండ ఏరియా దళ కమాండర్‌గా నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. ఆ సమయంలోనే అగ్రనేత నంబాల కేశవరావు డైరెక్షన్‌లో 2010 ఏప్రిల్ 7న సుక్మా జిల్లా చింతల్నార్ – టేక్‌మెట్ల అంబూష్ దాడిలో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఇప్పటివరకు మావోయిస్టులు జరిపిన దాడుల్లో ఇదే అతి పెద్దది.
భీకర దాడులకు కేరాఫ్
» 2013 ఏప్రిల్‌లో సుక్మా జిల్లా కంచాల దగ్గర కూంబింగ్ చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు. దీంతో కూంబింగ్‌ను అర్ధంతరంగా ఆపి హెలికాప్టర్ ఎక్కుతున్న ఆర్‌ఎస్సై పైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చనిపోయిన ఆర్‌ఎస్సై మృతదేహం అప్పగింత విషయంలో మూడు రోజుల పాటు హైడ్రామా నెలకొంది. ఈ సమయంలోనే తొలిసారిగా హిడ్మా పేరు బయటి ప్రపంచానికి తెలిసింది.
» 2013 మే 25న సుక్మా జిల్లాలోని దర్బా లోయలో సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ టార్గెట్‌గా ఝిరామ్‌ఘాటీ దగ్గర మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో కాంగ్రెస్ అగ్రనేతలు నందకుమార్ పటేల్‌తో పాటు 27 మంది చనిపోయారు. దీంతో భీకర దాడులకు కేరాఫ్ అడ్రస్ హిడ్మా అనే పేరు స్థిరపడిపోయింది.
» 2021 ఏప్రిల్‌లో బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అంబూష్లో 22 మంది జవాన్లు చనిపోయారు. ఈ ఘటన భద్రతా దళాల వెన్నులో వణుకు పుట్టించింది.
» 2023 ఏప్రిల్ 26న బీజాపూర్ జిల్లా ఆరాన్‌పూర్ దగ్గర ఐఈడీ బాంబు పేల్చిన ఘటనలో 10 మంది డీఆర్‌జీ జవాన్లు చనిపోయారు. అప్పటి నుంచి భద్రతా దళాలపై ఏ భారీ దాడి జరిగినా దాని వెనుక హిడ్మా ఉన్నాడనే ప్రచారం జరగడం సర్వసాధారణమైంది.
కోలుకోలేని ఎదురుదెబ్బ!
హిడ్మా ఎన్‌కౌంటర్‌తోమావోయిస్టు కేడర్‌లో ఆందోళన
శత్రువును దెబ్బ కొట్టే వ్యూహాల్లో హిడ్మా దిట్ట
ఇప్పటివరకు జరిగిన కీలకఆపరేషన్‌లన్నింటి మాస్టర్ మైండ్ అతనే
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు మూలాలపై కీలక దెబ్బ పడింది. కీలక నేత హిడ్మా భద్రత బలగాల ఎదురు కాల్పుల్లో మరణించడంతో..వారిలో భవిష్యత్తు గురించిన ఆందోళన మొదలైంది. శత్రువును వ్యూహాత్మకంగా దెబ్బతీయడంలో దిట్టగా పేరు పొందిన హిడ్మా సైతం ఎన్‌కౌంటర్‌లో మరణించడాన్ని ఆ పార్టీ కేడర్ జీర్ణించుకోలేక పోతోంది.
పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) కంపెనీ వన్ కమాండర్ హిడ్మాను హతమార్చేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సాయుధ పోలీసు బలగాలకు డెడ్‌లైన్ విధించారంటేనే హిడ్మా ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి 2023లో దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా చనిపోయినట్టు ప్రచారం జరిగింది. కానీ మావోయిస్టు కమిటీ హిడ్మా ఫొటోలు రిలీజ్ చేయడంతో ఆ ప్రచారానికి తెరపడింది. కానీ హిడ్మా భద్రత బలగాలకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.
గిరిజనుడు కావడంతో స్థానికంగా బలం..:
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన హిడ్మా స్థానికుడు కావడంతో గిరిజన ప్రాంతాల్లో పూర్తి పట్టుంది. ఈ నేపథ్యంలో హిడ్మా దళంలోనూ చాలా వరకు గిరిజనులే ఉంటారని సమాచారం. కాగా హిడ్మా బృందం అత్యంత శక్తివంతమైనదిగా మావోయిస్టులలో పేరుంది. చాలా తక్కువ మాట్లాడే హిడ్మా..శత్రువును దెబ్బకొట్టే వ్యూహాల రచనలో దిట్టగా పేరుపొందాడు. చిన్న వయస్సులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. హిడ్మాకు గోండి, కోయ, హిందీ, తెలుగు, బెంగాలీ భాషలపై పట్టుండడంతో స్థానికులతో బాగా కలిసిపోయేవాడని, ఇంగ్లిష్‌లోనూ మాట్లాడే వాడని సమాచారం. అతడి నెట్‌వర్క్ సైతం ఎంతో బలంగా ఉండేదని చెబుతారు.
హిడ్మా కోసం కొన్నేళ్ల పాటు ఛత్తీస్‌గఢ్ పోలీసులతో పాటు సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలు, ఏపీ, తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు సెర్చ్ ఆపరేషన్లు చేశాయి. అయితే ఎప్పటికప్పుడు స్థావరాలు మార్చే హిడ్మా..అదే క్రమంలో వేరే ప్రాంతానికి వెళుతూ ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడు. డిఫెన్స్‌లో పట్టుండడంతోపాటు ఎంతో పక్కాగా వ్యూహ రచన చేసే యువ నాయకత్వం లేకపోవడం ఇప్పుడు మావోయిస్టు కేడర్‌లో నైరాశ్యం నింపిందని మాజీ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హిడ్మాలా ముందుండి భద్రతా బలగాలను ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకత్వం లేదని ఆయన అన్నారు.
50 మంది మావోయిస్టుల అరెస్ట్!
బెజవాడ కానూరులో 28.. ఏలూరులో 15.. సామర్లకోట సమీపంలో ఇద్దరు
ప్రసాదంపాడులో మరో నలుగురు, గన్నవరంలో ఒకరు..
ఎక్కడికక్కడ వారున్న భవనాలను చుట్టుముట్టి పట్టుకున్న పోలీసులు
ఎలాంటి ప్రతిఘటన లేకుండానే లొంగిపోయిన వైనం
అందరూ హిడ్మా బృంద సభ్యులే అంటున్న పోలీసులు
పెనమలూరు/ఏలూరు టౌన్/సామర్లకోట: విజయవాడ సమీపంలోని కానూరులో, ప్రసాదంపాడులో, ఏలూరు గ్రీన్ సిటీలో, కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కొప్పవరంలో తల దాచుకున్న 50 మంది మావోయిస్టులు మంగళవారం పోలీసులకు పట్టుబడ్డారు. కానూరు ఆటోనగర్‌లోని ఓ భవనంలో 28 మంది, ప్రసాదంపాడు రైల్వే గేటు వద్ద నలుగురు, గన్నవరంలో ఒకరు, ఏలూరు గ్రీన్ సిటీలో 15 మంది, సామర్లకోట మండలం కొప్పవరం సమీపంలో ఇద్దరు మావోయిస్టులు పోలీసులకు పట్టుబడ్డారు.
ముందస్తు సమాచారంతో ఆక్టోపస్, ఇంటిలిజెన్స్, స్థానిక పోలీసులు ఒక్కసారిగా ఆయా ప్రాంతాల్లోని భవనాలపై మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో కానూరు వద్ద ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 28 మంది పట్టుబడగా, వీరిలో 21 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి (దేవ్‌జీ) అంగరక్షకులు తొమ్మిది మంది ఉన్నారు. వీరిలో నలుగురు కీలక హోదాల్లో ఉన్నట్లు సమాచారం. అయితే దేవోజీ దొరికాడా.. లేదా.. అనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు.
వీరు పట్టుబడిన భవనంలోనే కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కానూరు ఆటోనగర్‌లో మూడు అంతస్తుల భవనం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రైవేటు వ్యక్తికి చెందిన టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన గోడౌన్ ఉంది. భవనంలో పైన మూడు అంతస్తులు ఉన్నాయి. జర్మనీలో ఉంటున్న భవన యజమాని, ప్లానర్, బిల్డర్ స్వామినాయుడు తన భవనం అద్దెకు ఉందని ఆన్‌లైన్‌లో పెట్టాడని సమాచారం.
విశాఖపట్నంకు చెందిన ఈయనకు విజయవాడ బెంజి సర్కిల్ వద్ద కార్యాలయం ఉంది. అద్దెకు ఎవరూ రాక పోవటంతో ఆన్‌లైన్‌లో వివరాలు పెట్టారు. దీంతో మావోయిస్టులు కూలీ పనులు చేసుకోవటానికి వచ్చామని, భవనం కావాలని ఓ మహిళ ద్వారా సంప్రదించారు. దీంతో 20 రోజుల క్రితం ఆయన వీరికి భవనాన్ని అద్దెకు ఇచ్చారు.
భవనాన్ని చుట్టుముట్టి..
మావోయిస్టులు భవనంలో ఉన్నారన్న పక్కా సమాచారంతో కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఆక్టోపస్, స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున భవనాన్ని చుట్టుమట్టారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న వివిధ రకాల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. భవనంలో పెద్ద ఎత్తున సోదాలు చేశారు. ఇతరత్రా సామగ్రి ఉండటంతో క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్‌లు భవనాన్ని అణువణువు పరిశీలించాయి.
అనంతరం భవనాన్ని సీజ్ చేశారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగారులో భాగంగా చాలా మంది మావోయిస్టులు కేంద్ర బలగాల చేతిలో మరణించారు. అగ్రనేతలు సైతం చనిపోయారు. దీంతో మావోయిస్టులు అడవులు వదిలి నగరాలు, పట్టణాల బాట పట్టారు.
ఇందులో భాగంగానే 20 రోజుల క్రితం కానూరు ఆటోనగర్‌లో భవనం తీసుకుని ఉంటున్నారు. ఆటోనగర్‌లో బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిస్సా, తదితర రాష్ట్రలకు చెందిన కారి్మకులు వివిధ పనులు చేస్తుండటంతో మావోయిస్టులకు ఇక్కడ షెల్టర్ తీసుకోవటానికి వాతావరణం అనుకూలంగా మారింది.
పక్కా సమాచారంతో దాడులు : ఎస్పీ
మావోయిస్టులు కానూరు ఆటోనగర్‌లోని ఓ భవనంలో ఉన్నారన్న పక్కా సమాచారంతోనే దాడులు చేసి, 28 మందిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ విద్యాగర్‌నాయుడు మీడియాకు వెల్లడించారు. విజయవాడ ప్రాంతంలో వ్యూహాత్మకంగా దాడులు చేసేందుకే వారు వచ్చారన్నారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సెక్రటరీ తిప్పిరి తిరుపతి బృందాన్ని పట్టుకున్నామని, హిడ్మా బృందానికి చెందిన వారే ఇక్కడ షెల్టర్ తీసుకున్నారని తెలిపారు.


