టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్
ప్రకాశం బ్యారేజీలోకి 8,400 క్యూసెక్కులు ఎత్తిపోసేలా ఉండవల్లి వద్ద నిర్మాణం
రూ.423.64 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించిన ఏడీసీఎల్
పన్నుల రూపంలో మరో రూ.79.42 కోట్లు రీయింబర్స్
ఇప్పటికే కొండవీటి వాగు నుంచి 5,250 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసేలా ఎత్తిపోతల పూర్తి
మరో 4 వేల క్యూసెక్కులు కృష్ణా డెల్టా పశ్చిమ కాలువలోకి మళ్లించే పనులు పూర్తి
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని కొండవీటి వాగు వరద ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు ఉండవల్లి వద్ద మరో ఎత్తిపోతల నిర్మాణ పనులకు ఏడీసీఎల్(అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉండవల్లి వద్ద కొండవీటివాగు నుంచి రోజుకు 8,400 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసే ఈ ఎత్తిపోతల పనులకు రూ.423.64 కోట్లు కాంట్రాక్టు విలువగా నిర్ణయించింది.
జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.79.42 కోట్లను రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. కాంట్రాక్టు విలువ రూ.503.06 కోట్లన్నమాట. ఈ టెండర్లలో బిడ్‌లు దాఖలు చేసేందుకు తుది గడువు డిసెంబర్ 9. అదే రోజున సాంకేతిక బిడ్ తెరుస్తారు. డిసెంబర్ 10న ఆర్థిక బిడ్ తెరిచి.. తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌కు డిసెంబర్ 19లోగా పనులు అప్పగించేలా ఏడీసీఎల్ షెడ్యూలు ప్రకటించింది. ఈ పనులను రెండేళ్లలోగా పూర్తి చేసి.. 15 ఏళ్లపాటు నిర్వహించాలని షరతు విధించింది.
కొండవీటివాగు, గుంటూరు చానల్‌పై 2 లేన్ బ్రిడ్జి
కరకట్ట రోడ్డును అనుసంధానిస్తూ కొండవీటివాగు, గుంటూరు చానల్‌పై షిప్ లాక్, రెగ్యులేటర్‌తో కూడిన రెండు వరుసల(2 లేన్) బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ.55.85 కోట్ల కాంట్రాక్టు విలువతో ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. మరో రూ.10.66 కోట్లను పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. ఈ పనులను రెండేళ్లలోగా పూర్తి చేసి, మరో రెండేళ్లపాటు నిర్వహించాలని షరతు విధించింది. రెండు వందల సంవత్సరాల్లో గరిష్ట వర్షపాతాన్ని అంచనా వేసి.. ఆ స్థాయిలో వరద వచి్చనా ఎలాంటి ముప్పు లేకుండా కొండవీటివాగు, గుంటూరు చానల్‌పై షిప్ లాక్, రెగ్యులేటర్‌తో కూడిన 2 లేన్ బ్రిడ్జిని నిర్మించాలని నిర్దేశించింది. జాతీయ జలరవాణా మార్గం–4లో ఉండవల్లి నుంచి నీరుకొండ మధ్య కార్గో రవాణాకు వీలుగా షిల్డ్ లాక్‌ను నిర్మించాలని నిర్ణయించింది.
కృష్ణానది వరద కొండవీటి వాగులోకి ఎగదన్ని ముంపు
కొండవీటి కొండలలో పేరేచెర్ల వద్ద పురుడుపోసుకునే కొండవీటి వాగు అచ్చంపేట, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల మీదుగా ప్రవహించి.. ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉండవల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. రాజధాని ప్రాంతంలో 23.85 కిమీల పొడవున ప్రవహిస్తుంది. కొండవీటి వాగు, కృష్ణా నదికి ఒకే సారి వరద వచ్చినప్పుడు కృష్ణా వరద కొండవీటి వాగులోకి ఎగదన్ని రాజధాని ముంపునకు దారితీస్తోంది.
ఈ నేపథ్యంలో కొండవీటివాగు వరద ముప్పును తప్పించడానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిర్దేశించాయి. ఈ నేపథ్యంలో కొండవీటి వాగు వరద ముప్పు నుంచి రాజధానిని తప్పించేందుకు రోజుకు 5,250 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసేలా ఉండవల్లి వద్ద 2018లో రూ.260.48 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఎత్తిపోతలను నిరి్మంచింది.
అప్పట్లోనే కొండవీటివాగు వరద జలాలు 4 వేల క్యూసెక్కులను కృష్ణా డెల్టా పశి్చమ కాలువలోకి మళ్లించే పనులను పూర్తి చేసింది. కొండవీటివాగులో ఉండవల్లి వద్దకు గరిష్టంగా 17,650 క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కొండవీటి వాగు నుంచి ఉండవల్లి వద్ద మరో 8,400 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసేలా మరో ఎత్తిపోతల నిరి్మంచడానికి ప్రభుత్వం సిద్ధమైంది.


