మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ.. పోలీసుల అదుపులో తిరుపతి? | Top Maoist Leader Tippiri Tirupati Surrenders | Sakshi
Sakshi News home page

మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ.. పోలీసుల అదుపులో తిరుపతి?

Nov 18 2025 4:13 PM | Updated on Nov 18 2025 4:24 PM

Top Maoist Leader Tippiri Tirupati Surrenders

సాక్షి,అమరావతి: మావోయిస్టు ఉద్యమంలో కీలక నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ పోలీసుల ఎదుట లొంగిపోయారనే ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు దీనిపై అధికారికంగా ఏపీ పోలీస్ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు.

తిప్పిరి తిరుపతి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన ఈయన, 1983లో మావోయిస్టు ఉద్యమంలో చేరి దశలవారీగా ఎదిగి, కేంద్ర కమిటీ కార్యదర్శి స్థాయికి చేరుకున్నారు. గత మేలో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో, తిరుపతిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు తెలుస్తోంది. 

ఇటీవల లొంగుబాట్ల పరంపరలో మావోయిస్టులు కీలక నేతలు, కమాండర్లు పోలీసుల ఎదుట లొంగిపోతుండటంతో తిరుపతి సైతం లొంగిపోయినట్లు జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

మావోయిస్టు పార్టీలో ‘అభయ్’ అనే పేరుతో లేఖలు విడుదల చేసిన నేతగా తిరుపతిని గుర్తించారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే, తిరుపతి ప్రస్తుతం ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారా? లేదంటే అజ్ఞాతంలోనే ఉన్నారా? అనే అంశంపై స్పష్టత లేదు. మావోయిస్టు వర్గాలు ఈ విషయంపై మౌనం పాటిస్తుండగా, పోలీసు వర్గాలు కూడా అధికారికంగా స్పందించలేదు.

ఆర్‌ఎస్‌యూ నేపథ్యమే..
కోరుట్లలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన తిరుపతి 1983లో డిగ్రీ చదువుతున్న క్రమంలో రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. ఆ సమయంలో ఏబీవీపీ, ఆర్‌ఎస్‌యూ విద్యార్థి సంఘాల మధ్య గొడవలు సాధారణంగా జరుగుతున్న క్రమంలో పోలీసు కేసులు నమోదు అయ్యాయి. 1983 చివరలో తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. దళ సభ్యుడి స్థాయి నుంచి కమాండర్‌గా పనిచేసి అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ మెంబర్‌గా, మిలిషియా దాడుల్లో వ్యూహకర్తగా సెకండ్‌ క్యాడర్‌ హోదాలో పనిచేస్తున్నారు. 

ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఏరియాల్లో తిప్పిరి తిరుపతిని దేవ్‌జీగా పిలుచుకుంటారు. మిలి షియా దాడులు జరిపి నిమిషాల్లో అక్కడి నుంచి తప్పించుకోవడం తిరుపతికి వెన్నతో పెట్టిన విద్యగా చెబుతారు. తిరుపతి సమీపంలోని అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడి ఘటనలో నంబాల కేశవరావుతో పాటు తిప్పిరి తిరుపతి పాత్ర ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. 2010లో దంతెవాడ సమీపంలో సెంట్రల్‌ రిజర్వ్‌ జవాన్లపై దాడి జరిపి 74 మంది మృతి చెందిన ఘటనకు సారథ్యం వహించింది ఇతడేనని పోలీసు వర్గాలు చెబుతాయి. ఆయన తలకు ఎన్‌ఐఏ రూ. కోటి రివార్డు ప్రకటించినట్లు సమాచారం.

ఎక్కడున్నడో ఏమో? 
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఏరియాల్లో మావోయిస్టు పార్టీ రిక్రూట్‌మెంట్‌లో కీలకంగా వ్యవహరించడంతోపాటు మిలటరీ శిక్షణ కేంద్రం నిర్వహణలోనూ తిరుపతి పాలుపంచుకున్నట్లు సమాచారం. ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో తి రుపతి తన స్థావరాలు మార్చుకుంటున్నట్లు పో లీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల కొంత మంది మా వోయిస్టు కీలక నేతలు పశ్చిమ బెంగాల్‌ సరి హద్దు ప్రాంతాల్లోకి వెళ్లి షెల్టర్‌ తీసుకుంటున్నట్లు నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ భావించింది. 

కొద్ది నెలల క్రితం మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు కోరుట్లలోని తిరుపతి ఇంటికి వెళ్లి అజ్ఞాతంలో ఉన్న అతడిని  లొంగిపోయేలా చూడాలని ఆయన బంధువులను సైతం కోరారు. ఈ క్రమంలో తిరుపుతి అడవిని వదిలి ఏపీ పోలీసులకు లొంగిపోయినట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement