తొలి ఏడాది రూ.10,716 కోట్ల పెట్టుబడి సాయానికి బాబు సర్కారు ఎగనామం..
రైతన్నలకు రెండేళ్లలో ఇవ్వాల్సింది రూ.21,432 కోట్లు.. మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు..
రెండో ఏడాది తొలి విడతలో విదిల్చింది రూ.2,342 కోట్లే.. ఇప్పుడు మలి విడతలోనూ కేవలం రూ.2,342 కోట్లే ఇవ్వనున్న బాబు సర్కారు
46.85 లక్షల మందికే ‘సుఖీభవ’.. దాదాపు ఏడు లక్షల మంది భూ యజమానుల ఏరివేత
కౌలు రైతులకు ఈ విడతలోనూ మొండిచెయ్యే
‘పీఎం కిసాన్’ కాకుండా.. తాము సొంతంగానే ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేల చొప్పున ఇస్తామన్న చంద్రబాబు
అదునుకు పెట్టుబడి సాయం అందక అన్నదాతల హాహాకారాలు
వైఎస్ జగన్ హయాంలో ఏటా సీజన్‌కు ముందే తొలివిడత పెట్టుబడి సాయం
‘వైఎస్సార్ రైతు భరోసా’తో ఐదేళ్లలో రూ.34,288.17 కోట్ల మేర రైతన్నలకు లబ్ధి
సాక్షి, అమరావతి: అన్నదాతా సుఖీభవ పథకం కింద తొలి ఏడాది రూ.10,716 కోట్ల పెట్టుబడి సాయానికి ఎగనామం పెట్టిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు రెండో ఏడాదిలోనూ మరోసారి రైతన్నలను వంచిస్తోంది. ఓవైపు భూ యజమానులకు అడ్డగోలుగా కోతలు పెడుతూ మరోవైపు కౌలు రైతులకు మొండిచెయ్యి చూపుతోంది. సూపర్ సిక్స్ హామీ మేరకు ఈ పథకం కింద పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా, ఏటా ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు నమ్మబలికారు.
ఆ లెక్కన అర్హులైన 53.58 లక్షల మందికి రూ.10,716 కోట్లు ఇవ్వాల్సి ఉండగా తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని చంద్రబాబు సర్కారు పూర్తిగా ఎగ్గొట్టింది. సామాజిక వర్గాలకు అతీతంగా భూ యజమానులతో పాటు కౌలు రైతులకూ రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామన్న హామీని అటకెక్కించింది. బకాయిలతో కలిపి అన్నదాతా సుఖీభవకు ఈ ఏడాది రూ.21,432 కోట్లు జమ చేయాలి. కానీ కేవలం రూ.4,685.84 కోట్లు మాత్రమే విదిల్చింది.
2024–25 ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రెండు నెలలు తర్వాత పీఎం కిసాన్‌తో ముడిపెట్టి తొలివిడత సాయం అంటూ మభ్యపుచ్చారు. వాస్తవానికి 53.58 లక్షల మందికి జమ చేయాల్సి ఉండగా చివరికి 46.86 లక్షల మందికి సరిపెట్టారు. దాదాపు ఏడు లక్షల మందికి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టారు. తొలి ఏడాది సీసీఆర్సీ కార్డులు పొందిన 9.25 లక్షల మంది కౌలు దారులకు సైతం మొండిచెయ్యి చూపారు.
రెండో విడతలోనూ కోతలే లక్ష్యంగా..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2023–24 సీజన్‌లో 53.58 లక్షల మందికి వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని అందించింది. ఇలా ఐదేళ్లలో రూ.34,288.17 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఆరు దశల వడపోతల అనంతరం అన్నదాతా సుఖీభవ తొలిదశ లబ్ధిదారులను 46.86 లక్షలకు కుదించింది.
చనిపోయిన రైతుల స్థానంలో అర్హులైన వారి వారసులను మ్యుటేషన్ ద్వారా గుర్తించి గత ప్రభుత్వంలో పెట్టుబడి సాయం అందించగా ఇప్పుడు చంద్రబాబు సర్కారు దీనికి మోకాలడ్డుతోంది. వాస్తవానికి ఏటా భూ యజమానులతో పాటు కౌలుదారుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. గతంతో పోలిస్తే భూ యజమానుల సంఖ్య పెరగాల్సి ఉండగా ఇప్పుడు రెండో విడతలో 46,85,838 మంది మాత్రమే అన్నదాతా సుఖీభవకు అర్హత పొందినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కోతలే కోతలు..
తొలి విడతలో అన్నదాత సుఖీభవ కింద రూ.2,342.92 కోట్లు ఇచ్చినట్లు చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు రెండో విడతలో 46.85 లక్షల మందికి రూ.2,342.92 కోట్లు జమ చేయనుంది. ప్రభుత్వం సాయం అందించే మొత్తం పెరగాల్సింది పోయి లబ్ధిదారుల సంఖ్యలో కోతలు విధించడం పట్ల అన్నదాతల్లో తీవ్ర నిరాశ అలుముకుంది.
కౌలు రైతులకు మళ్లీ నిరాశే..
సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా వాస్తవ సాగుదారులైన కౌలు రైతులందరికీ అన్నదాతా సుఖీభవ సాయాన్ని అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా ఈ క్రాప్ అంటూ మెలిక పెట్టారు. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులుంటారని అంచనా. వారిలో సెంటు భూమి కూడా లేని సాగుదారులు 10 లక్షల మందికి పైనే ఉన్నారు. గతేడాది 9.25 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేసినా పెట్టుబడి సాయం అందించిన పాపాన పోలేదు.
ఈ ఏడాది 10 లక్షల మందికి సీసీఆర్సీ కార్డులు జారీ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 7.92 లక్షల మందికి కార్డులు జారీ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఊసెత్తడం లేదు. తొలి ఏడాది సీసీఆర్సీ కార్డులు పొందిన వారిని పరిగణలోకి తీసుకున్నా ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున మొత్తం రూ.1,850 కోట్లు జమ చేయాల్సి ఉండగా ఇవ్వకుండా ఎగ్గొట్టింది.
ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు సీసీఆర్సీలు పొందిన వారితోపాటు ఈ క్రాప్‌లో నమోదైన వాస్తవ సాగుదారులను లెక్కలోకి తీసుకుంటే కనీసం 10 లక్షల మందికిపైగా కౌలుదారులకు రూ.రెండు వేల కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని అందించాలి. కౌలు రైతులకు రెండోసారి కూడా మొండిచెయ్యి చూపేందుకు సిద్ధమవడం పట్ల కౌలు రైతుల సంఘాలు మండిపడుతున్నాయి.


