కొనుగోలు కేంద్రాల ఊసెత్తని చంద్రబాబు సర్కారు
తక్కువ ధరకే అమ్ముకుంటున్న రైతులు
తెలంగాణలో 120 కేంద్రాల్లో 8 లక్షల టన్నుల కొనుగోలు
ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చంద్రబాబు సర్కారు మీనమేషాలు లెక్కిస్తోందని ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. మద్దతు ధర దక్కక రైతులు కన్నీరు పెడుతున్నా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రైతులు మొక్కజొన్నను తక్కువ ధరకు అమ్ముకుంటున్నా కొనుగోలు కేంద్రాలు తెరవకుండా... రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం ధరలు పడిపోయినప్పుడు రైతుల వద్ద కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్న కనీస బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.
మొక్కజొన్నకు కేంద్రం కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2,400 ప్రకటించగా.. రాష్ట్రంలో రైతులు క్వింటా రూ.1,700 నుంచి రూ.1,900కు అమ్ముకుంటున్న దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే మొక్కజొన్న రైతులు రూ.400 కోట్లకుపైగా నష్టపోతారని ఆందోళన వ్యక్తంచేశారు. పొరుగున ఉన్న తెలంగాణలో 120 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, ఎకరాకు 25 క్వింటాళ్ల వంతున కనీస మద్దతు ధరకు ఇప్పటికే ఎనిమిది లక్షల టన్నులకుపైగా మొక్కజొన్న కొనుగోలు చేశారని తెలిపారు.
పత్తి రైతులదీ ఇదే దుస్థితి
రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉందని నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 11.27 లక్షల ఎకరాల్లో పత్తి సాగైందని, దీనిలో 50 శాతం కర్నూలు జిల్లాలో, 20 శాతం పల్నాడు జిల్లాలో సాగైందని వివరించారు. పత్తి మద్దతు ధర క్వింటా రూ.8,110 కాగా, రైతులకు అతి తక్కువ ధర ఇస్తున్నారని ఆయన తెలిపారు.


