మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి ధ్వజం
అప్రజాస్వామిక విధానాలతో టీడీపీ భూస్థాపితం
పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే యత్నం
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, చంద్రబాబు పాలనా వైఫల్యాలతో ఈ ప్రభుత్వం అతి త్వరలోనే కుప్పకూలడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. హిందూపురంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాల దాడి అత్యంత హేయమని మండిపడ్డారు. దాడిని నిలువరించాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారని, పైగా తమ పార్టీ కార్యకర్తలపై ఎస్సీ అట్రాసిటీ కేసు బనాయించారని ఆక్షేపించారు. హిందూపురం బయలుదేరిన తమ పార్టీ నాయకులను ఆదివారం ఎక్కడికక్కడ అడ్డుకోవటాన్ని ఖండించారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
దాడి వెనుక బాలకృష్ణ ప్రోద్బలం
‘ప్రశాంతత కోరుకునే హిందూపురంలో జరిగిన ఘటన చూసి ప్రజలు టీడీపీని, ఎమ్మెల్యే బాలకృష్ణను అసహ్యించుకుంటున్నారు. రాజకీయ విమర్శ చేసినందుకు పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం హేయం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు సహించరానివి. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో అడుగు పెట్టిన రోజే ఈ ఘటన జరగటాన్ని బట్టి దాడి వెనుక ఆయన ప్రోద్బలం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. బాలకృష్ణ ఆదేశాలతోనే టీడీపీ గూండాలు దాడి చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
బాధితులపైనే అక్రమ కేసులా?
దాడి సమయంలో అక్కడే ఉన్న పోలీసులు నిలువరించకపోగా, అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించడం సిగ్గుచేటు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు దిగుతూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. హిందూపురం వెళ్తున్న అనంతపురం, సత్యసాయి జిల్లాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను అడ్డుకుని వెనక్కి పంపారు. మాజీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టులు చేశారంటే వైఎస్సార్ సీపీని చూసి ఈ ప్రభుత్వం ఎంత భయపడుతోందో తెలుస్తోంది.
సతీష్ మృతిపై తప్పుడు ప్రచారం
‘టీటీడీ పూర్వ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్ మృతిపై ప్రాథమిక దర్యాప్తు పూర్తి కాకుండానే, చివరకు పోస్టుమార్టం నిర్వహించకముందే వైఎస్సార్‌సీపీని నిందిస్తూ ఎల్లో మీడియా, టీడీపీ అనుకూల సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. వైఎస్సార్‌సీపీపై నిందలు మోపి రాజకీయంగా బురద జల్లడమే లక్ష్యంగా హత్య అంటూ కట్టుకథ ప్రచారం చేశారు’ అని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు.


