రాష్ట్ర కార్యాలయం నుంచే ఇన్విజిలేటర్ల నియామకం
పర్యవేక్షకులు, స్క్వాడ్‌తో కలిపి 37 వేల మంది ఎంపికకు అధికారుల కసరత్తు
సాక్షి, అమరావతి: పదోతరగతి పరీక్షలను మార్చిలో నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మార్చి 16తో ఒక టైంటేబుల్, మార్చి 21తో మరో టైంటేబుల్ రూపొందించి అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఈ రెండింటిలో ఒకదానికి ప్రభుత్వం ఓకే చెప్పనుంది. ఈలోగా పరీక్షల సిబ్బంది నియామకం, ఇన్విజిలేటర్ల ఎంపిక, పరీక్ష సెంటర్ల గుర్తింపుపై దృష్టిసారించారు. దాదాపు 6.50 లక్షలమంది విద్యార్థులు 3,500 సెంటర్లలో పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 35 వేలమంది ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది అవసరం. పరీక్షల సరళి పరిశీలన కోసం మరో రెండువేల మంది స్క్వాడ్ సిబ్బందిని నియమించాలి. గతేడాది ఇన్విజిలేటర్ల ఎంపికను జిల్లాల్లో చేపట్టగా, ఈసారి రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టరేట్ నుంచే చేపట్టాలని నిర్ణయించారు.
చార్జి మెమోలు, సస్పెన్షన్ ఉంటే నో చాన్స్
ఇన్విజిలేటర్ల ఎంపిక కోసం రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టరేట్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇన్విజిలేటర్లుగా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలను తీసుకోనున్నారు. యూడైస్‌లో డేటా ఆధారంగా ఉపాధ్యాయుల పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని డైరెక్టరేట్ అధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. గతంలో చార్జి మెమోలు తీసుకున్నవారు, సస్పెన్షన్‌కు గురైనవారు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారిని పరీక్ష విధులకు దూరం పెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది.
స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తున్నందున ఆ సబ్జెక్టు పరీక్షల సమయంలో సంబంధిత సబ్జెక్టు టీచర్లను పరీక్ష విధుల నుంచి తప్పించనున్నారు. గతేడాది పదో తరగతి పరీక్ష పేపర్లు వాట్సాప్‌లో ప్రత్యక్షమవడంతో బాధ్యులపై చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలోగా పరీక్షల షెడ్యూల్‌పై ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.


